నటుడిగా కంఫర్ట్ జోన్‌లో ఉండడం నాకు గిట్టదు. దాన్ని అధిగమించడానికి ఎప్పటికప్పుడు జానర్ మార్చి సినిమాలు చేస్తున్నాను కాబట్టే గతంలో ‘దసరా’ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ చేయగలిగాను’ అని నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను నాని పాత్రికేయులతో పంచుకున్నారు. ‘హాయ్ నాన్న’ కథ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంది. ‘జెర్సీ’ సినిమా చూసి బయటకొచ్చినప్పుడు హృదయం బరువెక్కుతుంది. ‘హాయ్ నాన్న’ చూశాక ప్రేక్షకులు నవ్వుతూ హుషారుగా బయటకు వస్తారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ ఏడాదిలో ప్రేక్షకులు మెచ్చే గొప్ప చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ‘హాయ్ నాన్న’తో ఏడాదిని విజయవంతంగా ముగిస్తాం.దర్శకుడు శౌర్యువ్ కథ చెప్పినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది. ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడూ అదే అనుభూతికి లోనయ్యాను. సినిమాలో పాటలన్నీ చక్కగా కుదిరాయి. హేషమ్ నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. మృణాల్ ఠాకూర్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. శ్రుతీహాసన్ ఒక పాటలో మాత్రమే కనిపిస్తారు. ఇమేజ్ కోణంలోంచి చూసి కథను ఓకే చేయను. భవిష్యత్తులో ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ లాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘హిట్ 3’ స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.