సోషల్ మీడియా వేదికగా తనపై కామెంట్ చేసినవాళ్లపై మండి పడ్డారు దర్శకుడు వెంకటేష్ మహా. ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు ఇక ఊరుకొనేది లేదు అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాను ‘హాయ్ నాన్న’ సినిమా చూశానని, సినిమా బాగా నచ్చిందని దర్శకుడు వెంకటేశ్ మహా ట్వీట్ చేశారు. హీరో నాని కథలను ఎంపిక చేసుకునే తీరు స్ఫూర్తిగా ఉంటుందని, ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ శౌర్యువ్‌ని ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘ఈయన తీసింది ఒక్క సినిమా. పైగా ‘కేజీయఫ్’ బాలేదు అని రివ్యూ ఇస్తాడు. ఈయన హీరో అట.. కామెడీ ఫెలో’ అని కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్‌కు వెంకటేశ్ రిప్లై ఇస్తూ.. ‘‘వదిలేేస్త మాట వినరుగా మీరు. సరే చెబుతున్నా వినండి. ఎన్ని సినిమాలు చేశారన్నది కాదు.. ఏ సినిమాలు తీశామన్నది ముఖ్యం. అవి ప్రేక్షకులకు ఎలా రీచ అయ్యాయి అన్నది ముఖ్యం. తెలుగులో నేను కొన్ని బెస్ట్ సినిమాలు తీశానని గర్వంగా చెప్పుకొంటా. భవిష్యత్తులోనూ తీస్తా. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు వాగితే.. ఇక ఊరుకోను’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఇలా కామెంట్ చేసేవారిపై వ్యక్తిగతంగా, న్యాయపరంగానూ పోరాడతానని, తనకు మద్దతు ఇవ్వాలని అభిమానుల్ని కోరారు. వెంకటేశ మహాపై ఇంత నెగిటివిటీ పెరగడానికి ఓ చర్చా వేదిక కారణం. కొన్ని నెలల క్రితం ఇతర దర్శకులతో కలిసి వెంకటేశ్ మహా ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన.. యశ్ నటించిన కన్నడ సినిమా ‘కేజీయఫ్’పై కామెంట్స్ చేశారు. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశారని నెటిజన్లు ఆగ్రహించారు. తాను ఓ ఇండస్ట్రీని కింద పరిచేందుకు అలా మాట్లాడలేదని, సినిమాలోని కల్పిత పాత్రనే తప్ప వ్యక్తిని దూషించలేదని వెంకటేశ్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నెటిజన్ కామెంట్ వల్ల మళ్లీ చర్చ మొదలైంది.