విజయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి.. అందరూ గెలుస్తారని అనుకుంటారు.. వాళ్లే గెలుస్తారు. రెండు.. అందరూ గెలవరేమో అనుకుంటారు. వాళ్లూ గెలుస్తారు. ఈ రెండు రకాల విజయాలను 2023 నాకు ఇచ్చింది. ఒక స్టేడియం అంతా చీర్ చేస్తుంటే గెలవడం చూశాను. అదే స్టేడియం అంతా సైలెంట్‌గా ఉంటే గెలవడమూ చూశాను. ముఖ్యంగా ‘హాయ్ నాన్న’ వంటి అందమైన చిత్రంతో ఈ విజయం అందుకోవడం నాకు ఇంకా స్పెషల్’ అన్నారు హీరో నాని. ఇటీవల జరిగిన ‘హాయ్ నాన్న’ చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. ‘బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయిల గురించి మాట్లాడుతుంటారు కానీ నాకు మాత్రం శుక్రవారం సినిమా విడుదలైతే ‘నాని సినిమాకి వెళ్దాం రా’ అని ప్రేక్షకులు అనుకుంటే అదే గొప్ప స్థాయిగా ఫీల్ అవుతాను. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరేదీ లేదని నమ్ముతాను. ఆ స్థాయినీ, స్థానాన్నీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’ అన్నారు. చిత్ర దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ ‘ నానిగారు ఈ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను. ఆయన వల్లే ఇంత విజయం సాధ్యమైంది. మృణాల్ ఈ సినిమాను బలంగా నమ్మారు. యష్ట పాత్రతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. బేబి కియారా వండర్ కిడ్. చాలా చక్కగా నటించింది’ అన్నారు. చిత్ర నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ ‘శౌర్య కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యా. నానిగారు ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. ‘హాయ్ నాన్న’ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’ అన్నారు.