విశ్వనటుడు కమల్ హాసన్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇండియన్-2’ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకులతో పాటు కమల్ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ చిత్రం టాకీపార్ట్ మొత్తం షూటింగ్ పూర్తిచేశారు. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఈ చిత్రం విడుదల ఎప్పుడన్నది చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ వర్గాల మేరకు ఈ సినిమా వేసవి సెలవులు లేదా దీపావళికి విడుదల చేసే అవకాశం ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మరికొన్ని నెలలకు ‘ఇండియన్-3’ సినిమా విడుదలకావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఇండియన్ 2’తో పాటు 3కి సంబంధించిన షూటింగ్ కూడా శంకర్ పూర్తి చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.