అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించే విషయంపై ఆయన మనవరాలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందించారు. మంచి దర్శకుడు దొరికితే దాని గురించి ఆలోచన చేస్తామన్నారు. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి 91వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ‘ది అపోలో స్టోరీ ది అమర చిత్ర కథ’ (కామిక్స్) పేరుతో ముద్రించిన పుస్తకాన్ని సోమవారం చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సి రెడ్డితో పాటు ఆయన కుమార్తెలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, సునీతారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన విలేకరులతో మాట్లాడుతూ... ‘ది అపోలో స్టోరీ - అమర చిత్ర కథ’ పుస్తకాన్ని రూపొందించడానికి హీరో రానా దగ్గుబాటి ఎంతగానో సహాయం చేశారు. హెల్త్ కేర్ గురించి యువతకు తెలియజెప్పాలన్న ఉద్దేశంలో ఈ పుస్తకాన్ని ముద్రించాం. మా తాత నాకు స్ఫూర్తి, ప్రేరణ. ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. ఆయన మా గ్రాండ్‌మా, నలుగురు కుమార్తెల జీవితాలను తీర్చిదిద్దారు. ఏదైనా సమస్య ఎదురైతే పురుషులతో సమానంగా ధీటుగా ఎదుర్కోవాలని తాత మాలో ధైర్యాన్ని నింపి, అలా మమ్మల్ని తయారు చేశారు’ అన్నారు.