తమిళ సూపర్‌స్టార్ విజయ్ ‘తమిళ వట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ సినిమాలకు దూరంగా ఉంటానని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజా ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ని ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కి శుభాకాంక్షలు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రోత్సహించిన వారిలో నేనూ ఉన్నాను. వీటి గురించి మేము చర్చించుకున్నాం. ఒకదానిలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిచిపెట్టాలని లేదు. రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్ వ్యక్తిగత అభిప్రాయం. విజయ్ చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. నన్ను అలా చేయమంటే ఎలా? అద్భుతంగా పాటలు రాసే ఓ రచయితలా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు. ఎవరి ప్రతిభ, సామర్థ్యాలు వారివి. నేను రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను’’ అని కమల్‌హాసన్ వెల్లడించారు. విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’అనే చిత్రం నటిస్తున్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో ఇండియన-2 చిత్రం కూడా చేస్తున్నారు. విజయ్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు.