రామ్ మిర్యాల.. ఆయన పాట వింటుంటే మన స్నేహితుడే పాడుతున్నట్లుంటుంది. మన మట్టి వాసనను గుర్తుకు తెచ్చేలా, మన భావోద్వేగాలను స్పృశించేలా పాట పాడటం రామ్ మిర్యాల ప్రత్యేకత. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘ఆయ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్న రామ్ మిర్యాల మీడియాతో ముచ్చటించారు. ‘‘ఆయ్’ సినిమా కోసం నన్ను బన్నీవాస్ పిలిచారు. నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకలా ఉంటుంది. ఆయనేమో నెటివిటీ బేస్‌డ్ ఫన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తామని అన్నారుగా.. నాకేం సెట్ అవుతుందిలే నో చెప్పేద్దామని అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్లి కథ విన్నాక.. చాలా బాగా నచ్చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇప్పటి వరకు ఇలాంటి జోనర్‌లో నేను సినిమా చేయలేదు, అందుకే ఒప్పేసుకున్నా. ఈ చిత్రం నాకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో చక్కటి కామెడీతో పాటు ఎంతో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సినిమాలో రెండు పాటలు చేశాను. రీసెంట్‌గా ‘సూఫియానా’ అనే మెలోడి సాంగ్ రిలీజైంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చేసిన మరో పాట పెళ్లి నేపథ్యంలో ఉంటుంది. అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్‌కి, చిత్ర దర్శకుడితో మంచి బంధం ఉండాలి. అప్పుడే మంచి సంగీతం కుదురుతుంది. ఓ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్ని రకాల పాటలను చేయాలనేది నా కోరిక. నేను రీసెంట్‌గా వర్క్ చేసిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఈ నెల 29న రిలీజ్ అవుతోంది.