సిద్దు జొన్నలగడ్డ 'డీజీ టిల్లు' తో తన పవర్ ఏంటో చూపించాడు, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' నిన్న విడుదలైంది. ఈ సీక్వెల్ తో అతను బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమాకి పది రేట్లు పవర్ తో వచ్చాడు. అతను ట్రైలర్ లో చెప్పినట్టుగా నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాను, కారణ జన్ముడిని అన్నట్టుగా మొదటి రోజు ఒక అగ్ర నటుడికి ఎలాంటి బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ వస్తాయో అంతలా మొదటి రోజు అతని సినిమా 'టిల్లు స్క్వేర్' వసూలు చేసింది. నిర్మాతలు అనుకున్నట్టుగానే ఈ సినిమా కనక వర్షం కురిపించింది. నిన్న శుక్రవారం సెలవు దినంకూడా కావటంతో ఈమధ్య కాలంలో ఏ సినిమా కూడా ఇంతలా మొదటి రోజు నిజమైన కలెక్షన్స్ రాలేదేమో అన్నట్టుగా ఈ సినిమాకి వచ్చాయి. మొదటి రోజు సిద్దు జొన్నలగడ్డ సినిమా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్టు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ట్రైలర్ లో ఆమెని కొంచెం గ్లామరస్ గా చూపించినా, సినిమాలో ఆమె పాత్ర ఆశ్చర్యకరంగా ఉంటుంది. రామ్ మిరియాల, భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. సినిమా మొదటి నుండి చివరి వరకు వినోదాత్మకంగా సాగుతూ సిద్దు తన మాటలతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాడు. సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు. మొదటి రోజు రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిన ఈ సినిమా, శని, ఆదివారాలు ఇంకా ఎక్కువ కలెక్టు చేయొచ్చు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.