మహేష్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న SSMB29 సినిమాలో ఛాన్స్ వస్తే వెంటనే ఓకే చేస్తానని అన్నారు ‘కట్టప్ప’ సత్యరాజ్ . మిలియన్ స్టూడియో బ్యానర్‌పై ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’ . ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోన్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ.. పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్. తాన్యా హోప్ ఆంగ్లో ఇండియన్. కానీ తెలుగులో చక్కగా మాట్లాడింది. నేను తెలుగులో ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ ‘వెపన్’ మూవీ కూడా అలాంటి చిత్రమే. ఇది పెద్ద హిట్ కాబోతోంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్ కాబోతోంది. గుహన్ మంచి కథను రాసుకున్నారు. వసంత్ రవి జైలర్‌లో అద్భుతంగా నటించారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ‘కల్కి’ సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండని కోరారు. ఇంకా మీడియా అడిగిన ప్రశ్నకు కట్టప్ప సమాధానాలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ‘బాహుబలి’లో చేసిన ‘కట్టప్ప’ పాత్ర మీకు ఎంతో పేరు తెచ్చింది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించబోతోన్న సినిమాలో మీరు నటిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘రాజమౌళికి నేను ఎంతగానో రుణపడి ఉన్నా. బాహుబలితో ప్రపంచానికి నన్ను కట్టప్పగా పరిచయం చేశారు. నన్ను అందరూ ఇప్పుడు కట్టప్పగానే గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడొచ్చిన బాహుబలి యానిమేషన్ సిరీస్‌లో కూడా నా పాత్రని బాగా హైలెట్ చేశారు. ఇప్పుడాయన మహేష్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంత వరకు నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ రాజమౌళి ఇందులో కూడా ఓ పాత్ర ఇస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు.