బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఎట్టకేలకు దిగొచ్చాడు. ఇచ్చిన మాట నిలుపుకునే దిశగా ఓ అడుగు వేశాడు. సామాన్యులకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ రావడమే కష్టం. తెలుగులో ఏడు సీజన్స్ ముగిశాయి. కామనర్ కోటాలో బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు అడుగు పెట్టిన వాళ్ళు పది మంది కూడా లేరు. బాగా పాపులారిటీ ఉన్న సెలెబ్స్ ని మాత్రమే హౌస్లోకి పంపుతారు. కారణం... వారికంటూ ఓ అభిమానగణం ఉంటుంది. తమకు ఇష్టమైన నటులు, కమెడియన్స్, సోషల్ మీడియా స్టార్స్ రియల్ బిహేవియర్ తెలుసుకోవాలని ప్రేక్షకులు షో చూస్తారు. సామాన్యులకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసే అవకాశం వచ్చినా రాణించడం కష్టం. కానీ పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ కొట్టి చూపాడు. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా స్టార్. పెద్దగా పాప్యులర్ కూడా కాదు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్లాలనే తపన గట్టిగా ఉండేది. అందుకే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. సీజన్ 7లో అవకాశం దక్కింది. పల్లవి ప్రశాంత్ హౌస్లో చాలా ప్రశాంతంగా ఉండేవాడు. తోటి కంటెస్టెంట్స్ తో సన్నిహితంగా మెలిగేవాడు. ఒక్క నామినేషన్స్ డే మాత్రమే ఫైర్ బ్రాండ్ వలె మారేవాడు. ఫిజికల్ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ చాలా యాక్టీవ్. రైతుబిడ్డ అనే ట్యాగ్ పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయ్యింది. వీటన్నింటికీ మించి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు దానం చేస్తాను అన్నాడు.
అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ మనీ రూపంలో రూ. 35 లక్షలు వచ్చాయి. ఈ మొత్తంలో టాక్స్ కటింగ్స్ పోనూ.. మిగిలిన డబ్బులు పల్లవి ప్రశాంత్ పేదలకు రైతులకు దానం చేయాల్సి ఉంది. కానీ పల్లవి ప్రశాంత్ రూ. 1 లక్ష మాత్రమే ఒక కుటుంబానికి సహాయంగా ఇచ్చాడు. నెలలుగా గడుస్తున్న పల్లవి ప్రశాంత్ మరొకరికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పల్లవి ప్రశాంత్ మాటతప్పాడని అతడిని ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ దిగొచ్చాడు. మరో కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. మెదక్ జిల్లాకు చెందిన పరమేశ్వర్ అనే 32 ఏళ్ల యువ రైతు ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మరణంతో కుటుంబ భారం పరమేశ్వర్ భార్య మీద పడింది. ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ రూ. 20 వేలు సహాయం చేశాడు. ఆ ఊరికి స్వయంగా వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ ని చూసి ఆ ఊరి కుర్రాళ్ళు, యువతులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడడం విశేషం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని పల్లవి ప్రశాంత్ డిసైడ్ అయ్యాడు.