ప్రస్తుతం ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకూ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న కథానాయిక రష్మిక . 'పుష్ప-1'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు 'పుష్ప2: ది రైజ్'లోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు.స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమెకు కెరీర్ తొలినాళ్లలో అవకాశాలేవీ అంత సులభంగా రాలేదట. అందుకు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొన్ని ఆడిషన్స్ వెళ్తే, నటనకు పనికి వచ్చే ముఖమేనా అన్న కామెంట్లు వినిపించాయట.
'ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఒక సినిమా కోసమైతే పదే పదే ఆడిషన్ చేశారు. ఎట్టకేలకు ఆ మూవీలో సెలక్ట్ అయ్యాను. రెండు, మూడు నెలల పాటు ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ జరిగాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆ తర్వాత దాదాపు పాతిక ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేశారు. నా నటనపై వాళ్లకెప్పుడూ అనుమానం ఉండేది. ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు. దీంతో నా ప్రతి సినిమాకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వచ్చా. నేనెప్పుడు నా సినిమాలు చూసినా, ఇంకాస్త బాగా చేస్తే బాగుండేదనుకుంటా'' అని రష్మిక వెల్లడించింది.ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక చేతిలో భారీ ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప: ది రైజ్'లో రష్మిక పాత్ర మరింత బలంగా ఉండనుంది. దీంతో పాటు బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో'చవ్వా', సల్మాన్‌తో 'సికిందర్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.