మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. జగపతి బాబు విలన్‌గా నటించిన ఈ మూవీ నేడు (ఆగస్టు 15) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా హరీష్ శంకర్-రవితేజ కాంబో అనగానే భారీ అంచనాలు ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మిస్టర్ బచ్చన్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే.. నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ మూవీలా హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
రీమేక్ సినిమా అయినా హరీష్ వాటిని తనదైన శైలిలో బాగా తీస్తాడని పేరుందని, అలాగే మిస్టర్ బచ్చన్‌ను కూడా తనదైన శైలిలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపిస్తాడని భావించినట్లుగా చెబుతున్నారు. సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే.. దాన్ని పక్కన బెట్టి.. పాటలు, వాటి కోసమే స్టోరీ అన్నట్లుగా రాసుకున్నాడని మండిపడుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉందని, డైరెక్షన్ మిస్సైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాటల కోసమే సినిమా తీశాడని, తామెన్నో అంచనాలో మూవీకి వచ్చామని ఆ స్థాయిలో సినిమా లేదంటున్నారు. హరీష్ శంకర్ గనుక ఆర్టీసీ క్రాస్ రోడ్డు వస్తే రవితేజ ఫ్యాన్స్ కొడతారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.