హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది.హేమ కమిషన్ తన నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్థులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది.
సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమా కమిషన్ పేర్కొంది. హేమా కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక హేమ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది మహిళా ఆర్టిస్టులు తమ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు వెల్లడిస్తున్నారు. మలయాళ ప్రముఖ నటి రేవతి సంపత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనపై ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దిఖీ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజాగా మరో నటి మిను మునీర్ తాను లైంగిక వేధింపులకు బాధితురాలినే అంటూ బాంబు పేల్చింది. తన తోటి నటులే తనను వేధింపులకు గురి చేశారని ఆమె వాపోయింది. ముఖేష్, మణియం పిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య అనే నలుగురు నటులు తనని సెట్స్‌లో శారీరకంగా వేధించారని చెప్పుకొచ్చింది. సభ్యత్వ దరఖాస్తు కోసం సంప్రదించగా, అమ్మ మాజీ కార్యదర్శి ఇడవెల బాబు తన ఫ్లాట్‌కు పిలిచి శారీరకంగా వేధించాడని ఆమె తెలిపింది.అలాగే ప్రస్తుత కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ కూడా తనను కమిట్మెంట్ అడిగారని,నిరాకరించిన తర్వాత.. తనకు సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకున్నారని మిను మునీర్ పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక దోపీడి ఎక్కువగా ఉందని, అందుకు సాక్షిని తానేనని తెలిపింది. దీంతో మాలీవుడ్‌లో అసలేం జరుగుతోందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.