చిరంజీవికి 'తమ్ముడు'. ఫ్యాన్స్‌కు 'తొలి ప్రేమ'. ప్రత్యర్థులకు 'గబ్బర్ సింగ్'. సన్నిహితులకు 'బంగారం'. భయమెరుగని 'కొమరం పులి'. టాలీవుడ్‌కు 'OG'. ఆయనను చూడగానే అందరిలో పుడుతుంది 'ఖుషి'. భక్తులకు ’గోపాల గోపాల‘. హీరోగా అంతులేని అభిమానం ఆయన సొంతం. రాజకీయంగా ఎదురైన అపజయాన్ని ఎదుర్కొని, పట్టుదలతో అద్భుత విజయం అందుకున్న జనసేనాని. అందరూ పవర్‌స్టార్ అని పిలుచుకునే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవర్‌లో ఉన్నారు. నేడు ఆయన బర్త్ డే.
పవన్ ఏం చదువుకున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న పవన్ జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యభ్యాసం బాపట్లనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. అనారోగ్యం, చదువులో చురుకుగా లేకపోవడంతో ఎంతో ఒత్తిడి గురైన పవన్ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. చిరు చొరవతో నటన నేర్చుకొని సినిమాల్లోకి వచ్చారు.