ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హిప్పీ' మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2019, 05:27 PM

నటీనటులు : కార్తికేయ, దిగంగా సూర్యవంశీ, జాబ్జా సింగ్, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : టిఎన్ కృష్ణ
నిర్మాత : కలై పులి. థాను
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజేష్ఎ
డిటర్ : ప్రవీణ్ కె ఎల్


ట్రెండ్ కి తగిన సినిమాలను తెరకెక్కించడం అంత తేలికైన పనేం కాదు. ఎందుకంటే, అప్పటికే ఆ తరహాలో ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి. అలాంటి సినిమాలో చూసేశాం కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి ఎక్కడా రాకూడదు. అందువలన చెప్పదలచుకున్న పాయింట్ కొత్తగా చెప్పినప్పుడే దర్శకుడి ప్రయత్నం ఫలిస్తుంది. అలాంటి కొత్తదనం కోసమేనన్నట్టుగా 'హిప్పీ' కోసం దర్శకుడు టీఎన్. కృష్ణ తనవంతు ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం.

దేవా (కార్తికేయ) జీవితాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటాడు. తనకి తోచిన విధంగా బతికేస్తూ అందరితో 'హిప్పీ' అని ముద్దుగా పిలిపించుకుంటూ ఉంటాడు. తన బావ (బ్రహ్మాజీ)తోను .. స్నేహితులతోను కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటుంటాడు. ఇక దేవా బాస్ అరవింద్ (జేడీ చక్రవర్తి) కూడా తన ఆఫీసులో అమ్మాయిలను పొగిడేస్తూ వలలోకి లాగేస్తుంటాడు.

స్నేహ (జజ్బా సింగ్)తో కలిసి షికార్లు చేస్తోన్న దేవాకి, ఆమె స్నేహితురాలిగా 'ఆముక్తమాల్యద' (దిగాంగన) తారసపడుతుంది. ఆమె అందచందాలను చూసి మనసు పారేసుకున్న దేవా, ఆమె వెంటపడటం మొదలుపెడతాడు. దేవా తనని సిన్సియర్ గానే ప్రేమిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఆముక్తమాల్యద, ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ పేరుతో అయన ఇంట్లోకి అడుగుపెడుతుంది.

అయితే ఆ తరువాతనే దేవా ఆమెను వదిలించుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. తన ఇంట్లో నుంచి ఆమెను పంపించేయడానికిగాను రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెడతాడు. దేవా ఉద్దేశాన్ని గ్రహించిన ఆముక్తమాల్యద, ఆయన పట్ల తనకి గల నిజమైన ప్రేమ కారణంగా ఆయనని తన సొంతం చేసుకువాలనే పట్టుదలతో ఎత్తుకు పైఎత్తులు వేయడం మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన నాటకీయ పరిణామాలతో కథ అనేకమైన మలుపులు తిరుగుతూ వెళుతుంది. చివరికి ఎవరిది పైచేయి అయిందనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

దర్శకుడు టీఎన్ కృష్ణ యూత్ ను దృష్టిలో పెట్టుకుని, తేలికైన కథనంతో సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. అక్కడక్కడా కొన్ని సరదా సన్నివేశాలను .. మరికొన్ని ఎమోషన్స్ సీన్స్ ను బాగా ఆవిష్కరించినా, లవ్ డ్రామాను .. కామెడీని  .. రొమాన్స్ ను ప్రేక్షకులకు సంతృప్తికరంగా అందించలేకపోయాడు. బలమైన కథాకథనాలు లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోతూ వచ్చాయి. ఒక దశలో కథ ట్రాక్ తప్పేసి జేడీ చక్రవర్తికి .. దిగాంగనకి ఎంగేజ్మెంట్ జరిగేవరకూ వెళ్లిపోతుంది. పోనీ అదంతా ఉత్తిత్తిదే అని కూడా చూపించరు.

స్వరూప స్వభావాల పరంగా పాత్రలను తీర్చిదిద్దిన తీరులో లోపం కనిపిస్తుంది. హీరోను అప్పుడప్పుడు శృంగార పురుషుడిగాను .. అక్కడక్కడా కాస్తంత అమాయకుడిగాను చూపిస్తూ ఆడియన్స్ ను అయోమయానికి గురిచేశారు. కొన్ని సన్నివేశాలు .. ఫైట్లు అనవసరమనిపిస్తాయి. అసలు స్నేహ ప్రేమను సీరియస్ గా తీసుకోకపోవడం .. ఆమె కష్టపడి దేవాను ఆముక్త మాల్యదతో కలిపితే వదిలించుకోవాలని దేవా చూడటం మొదలైన దగ్గర నుంచే కథనం పట్టుతప్పినట్టు అనిపిస్తుంది. ఆముక్తమాల్యద పాత్ర వ్యక్తిత్వాన్ని చివరివరకూ కాపాడుతూ వచ్చి, క్లైమాక్స్ లో ఆమె వ్యక్తిత్వానికి కూడా గండి కొట్టేశాడు. కథలో వేరే ట్రాకులు లేకుండా ఒకే ట్రాక్ పై ఒకే విషయంతో నడిపించడం .. అదీ సాగతీతగా ఉండటం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.

కార్తికేయ పాత్ర విషయానికే వస్తే లైఫ్ ను జాలీగా గడిపేసే దేవా పాత్రలో బాగానే నటించాడు. సిక్స్ ప్యాక్ బాడీతో యూత్ కి మంచి కిక్ నే ఇచ్చాడు. డాన్సుల్లోను .. ఫైట్స్ లోను ఫర్వాలేదనిపించాడు. అయితే కళ్లతో హావభావాలు పలికించే సన్నివేశాల విషయంలో మాత్రం అతగాడికి తక్కువ మార్కులే పడతాయని చెప్పాలి. 'దేవాను తాకడం కూడా ఇష్టం లేదు .. అందుకే అతన్ని కొట్టలేదు' అని అతని సమక్షంలోనే నైట్ డ్యూటీ పోలీసులతో ఆముక్తమాల్యద చెప్పిన సంఘటనే అందుకు ఉదాహరణ. కామెడీని ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాడు గానీ, ఎమోషన్స్ పలికించే విషయంపై ఆయన ఇంకా దృష్టి పెట్టాలి.

ఇక కొత్తమ్మాయి 'దిగాంగన' తన పాత్ర పరిథిలో మెప్పించింది. కళ్లతోనే హావభావాలను పలికిస్తూ ఆకట్టుకుంది. హీరోగారిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకునే పట్టుదలతో చేసే పనుల్లోనూ .. తనపట్ల అతగాడి మనసులో ఎలాంటి అభిప్రాయం వుందో తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాల్లోను బాగా చేసింది. నటన పరంగాను .. గ్లామర్ పరంగాను ఈ అమ్మాయికి మంచి మార్కులే దక్కుతాయని చెప్పొచ్చు.

ఈ సినిమాలో చెప్పుకోదగిన మరో పాత్ర జేడీ చక్రవర్తిదే. అరవింద్ పాత్రలో హీరోకి బాస్ పాత్రలో ఆయన కనిపిస్తాడు. లుక్స్ పరంగా జేడీ ఆకట్టుకున్నాడు .. పాత్ర పరంగానే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. జేడీ మామూలుగా మంచి నటుడు. అయితే, అతనిని ఈ పాత్రలో సరిగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. మనల్ని ప్రేమించే అమ్మాయిల పట్ల ఎలా మసలుకోవాలి? అనే విషయంలో హీరోగారికి జ్ఞానబోధ చేసే విషయంలోనే ఈ పాత్ర కాస్త నిలబడుతుంది.

హీరోకి దారిన పోయే దానయ్యలా తగిలిన హెచ్ డీ (వెన్నెల కిషోర్) నవ్వించే ప్రయత్నం కూడా కొంతవరకే ఫలించింది. పనిమనిషిగా హరితేజ తెరపై ఉన్నంత సేపు దడ దడ లాడించేసింది. ఇక బ్రహ్మాజీ .. జజ్బా సింగ్ .. శ్రద్ధా దాస్ పాత్రలు 'మమ' అనుకునేవే. సరైన ప్యాడింగ్ లేకపోవడం .. హీరో - హీరోయిన్లకు కుటుంబ నేపథ్యాలు లేకపోవడం కూడా ఆడియన్స్ ను నిరాశ పరిచే మరో విషయం.
 
సంగీతం విషయానికి వస్తే .. నివాస్ కె. ప్రసన్న సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. 'ఎవతివే .. ఎవతివే' .. 'ఏ ఎలా ఎటేపు వెళ్లి చూసినా' అనే పాటలు బాగున్నాయి. ఫాస్టు బీట్స్ తో పాటు మంచి మెలోడియస్ సాంగ్స్ కూడా చేయగలడనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది సినిమాటో గ్రాఫర్ ఆర్. డి. రాజేశ్ కే వెళుతుంది. కార్తికేయను హ్యాండ్సమ్ గా .. దిగాంగనను చాలా గ్లామరస్ గా చూపించాడు. ముఖ్యంగా పాటల్లోని లొకేషన్స్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. నిర్మాత కలైపులి థాను పెట్టిన ఖర్చుకు తన కెమెరా పనితనంతో మంచి రిచ్ నెస్ తీసుకొచ్చాడు.  

అనంత శ్రీరామ్ .. శ్రీమణి రాసిన పాటలు, బృంద .. శోభి కొరియోగ్రఫీ యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వున్నాయి. ఇక డైలాగ్స్ విషయానికొస్తే ఇటు హీరోయిన్ తోను .. అటు జేడీ చక్రవర్తితోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించారు. ఇలా ఈ సినిమా కొన్ని లిప్పులాకులు .. మరికొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కార్తికేయ వైపు నుంచి చూస్తే 'ఆర్ ఎక్స్ 100' స్థాయిని అందుకోలేక, సాగతీతగా .. సాదాసీదాగా అనిపిస్తుంది.  


surya riview: 2/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa