రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం' .లక్ష్మణ్ కార్య దర్శకత్వం ఈ సినిమా ఓటీటీ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. సదరు సంస్థ రిలీజ్ డేట్‌ను తాజాగా ఖరారు చేసింది. ఈ నెల 20 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ పంచుకుంది. మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం.
కథేంటంటే: సుబ్రమణ్యం (రావు రమేశ్) ఓ నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఫలితం కనిపించదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైనా, అది కాస్తా కోర్టు గొడవలతో చేతికందదు. దాంతో భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపైనే ఆధారపడుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య) పెద్దవాడయినా సుబ్రమణ్యానికి ఉద్యోగం మాత్రం రాదు. మరోవైపు, అర్జున్ తొలి చూపులోనే కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. తన కొడుకు ప్రేమని నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన సుబ్రమణ్యానికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనూహ్యంగా తన ఖాతాలో పడిన రూ.10 లక్షల డబ్బుని అవసరాల కోసం తండ్రీ కొడుకులు ఖర్చు పెట్టేశాక ఏం జరిగింది? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? అర్జున్, కాంచన ఒక్కటయ్యారా? సుబ్రమణ్యానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? అన్నది మిగతా కథ.