అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జిగ్రా'. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.అక్టోబర్ 11వ తేదీన ఈ చిత్రాన్ని సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా దగ్గుబాటి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్‌తో పాటు సమంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సమంత గురించి మాట్లాడుతూ.. తాను సమంతతో మూడు చిత్రాలకు పనిచేశానని, తెలుగు తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో రజినీకాంత్ తర్వాత సమంతేనని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఇక సమంతకు బన్నీ అప్పట్లో పెద్ద ఫ్యాన్ అని త్రివిక్రమ్ తెలిపారు. ఇక సమంత ప్రస్తుతం ఎక్కువ సమయం ముంబయిలోనే ఉంటున్నారని, అయితే అప్పుడప్పుడూ హైదరాబాద్ కూడా వస్తూ ఉండాలని త్రివిక్రమ్ కోరుకున్నారు. ప్రేక్షకులు అందరూ సమంత హైదరాబాద్ రావడానికి దారేది అనే ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ చేద్దామని చెప్పుకొచ్చారు.ఇక జిగ్రా మూవీ గురించి మాట్లాడిన త్రివిక్రమ్.. 'పోస్టర్ లేదా ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని సినిమాలు మమ్మల్ని చూడండి అని పిలుస్తాయి. జిగ్రా ట్రైలర్ యూట్యూబ్ లో చూసిన తర్వాత నాకు సినిమా చూడాలని అనిపించింది. ఈ సినిమా కోసం ఆలియా భట్ ఫిజికల్ గా కూడా ఎంత కష్టపడి ఉంటారో అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చూసిన వెంటనే సూపర్ హిట్ అని కొన్ని సినిమాలు గురించి మనం చెబుతాం కదా! ఈ సినిమా కూడా అంతే. ట్రైలర్ చూశాక సూపర్ హిట్ అనిపించింది' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.