అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ని ఉద్దేశించి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman Khan) మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ మాట్లాడారు.అండర్‌వరల్డ్ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.''నేను బాలీవుడ్లో వర్క్ చేసిన సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుకోవడం విన్నా. అయితే వారెవరూ కూడా వీరి గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకునేవారు కాదు. 'అండర్ వరల్డ్' అని పరోక్షంగా చెప్పేవారు. సల్మాన్‌తో నేను కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. గ్యాలెక్సీ నివాసంలో మూడేళ్లు మేమిద్దరం కలిసే ఉన్నాం. ఆ సమయంలో ఆయనకు ఓసారి అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ ఎవరు చేశారో తెలియదు కానీ.. అతడు మాత్రం బెదిరింపులకు పాల్పడ్డాడు. 'సల్మాన్‌కు చెప్పు.. ఆయన ప్రియురాలిని మేము కిడ్నాప్ చేయనున్నామని'' అన్నారు. అతడి మాటలు నన్నెంతో భయపెట్టాయి. వెంటనే ఆ విషయాన్ని సల్మాన్‌కు చెప్పా. ఆయన కూడా కంగారుపడ్డారు. పరిస్థితులు చక్కబడేలా చేశారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించా. సల్మాన్నూ అడిగా. 'ఈ విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది' అని ఆయన చెప్పారు'' అని సోమీ అలీ తెలిపారు.
సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి. పలు బాలీవుడ్ చిత్రాల్లోను నటించారు. 'ఆందోళన్', 'మాఫియా' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్‌ఖాన్ - సోమీ అలీ ప్రధాన పాత్రల్లో గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా ఆగిపోయింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సోమీ - సల్మాన్ ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈవిషయంపై ఓ సందర్భంలో సోమీ స్పందిస్తూ.. 'సల్మాన్ అంటే నాకెంతో ఇష్టం. సల్మాన్‌కు నా ప్రేమను తెలియజేశా' అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు వీళ్లిద్దరూ విడిపోయారు.