బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ తాజాగా మరో మెసేజ్ వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్‌రూమ్‌కు చెందిన వాట్సాప్ నంబరుకు ఈ సందేశం అందింది.గతంలో మెసేజ్ పంపిన వ్యక్తి పేరు లేదు. ఈసారి మాత్రం ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది.''నేను లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని(అన్మోల్ బిష్ణోయ్). సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే.. గతంలో కృష్ణజింకలను వేటాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే మాకు రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే సల్మాన్‌ను(Salman Khan) చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉంది'' అని ఆ మెసేజ్‌లో హెచ్చరించడం గమనార్హం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా అన్మోల్ బిష్ణోయ్ పంపాడా ? వేరెవరైనా అతడి పేరుతో ఈ మెసేజ్ పంపారా ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అన్మోల్ కెనడాలో ఉన్నాడు. అతడు అక్కడి నుంచి తరుచుగా అమెరికాకు వెళ్లి వస్తున్నాడు. కెనడా నుంచే భారత్‌లోని గ్యాంగ్‌కు అన్మోల్ కమాండ్స్ ఇస్తున్నాడని అంటున్నారు.
అంతకుముందు అక్టోబరు 30న సల్మాన్‌ను బెదిరిస్తూ ఇదే నంబరుకు మెసేజ్ వచ్చింది. సల్మాన్ ప్రాణాలతో బతకాలంటే రూ.2 కోట్లు చెల్లించాలని అప్పట్లో పంపిన మెసేజ్‌లో ప్రస్తావించారు. దాని కంటే ముందు సల్మాన్‌కు వచ్చిన ఇంకో బెదిరింపు మెసేజ్‌లో.. రూ.5 కోట్లు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. తమకు ముడుపు ఇవ్వకుంటే బాబా సిద్దిఖీలాగా చంపేస్తామని అప్పట్లో హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. మొత్తం మీద ఈ ఏడాది సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయి ముఠా టార్గెట్‌గా చేసుకున్నట్లు కనిపిస్తోంది