ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా (72) కన్నుమూశారు. మైలోమా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2017 నుంచి ఆమె మైలోమా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. శారదా సిన్హా బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో నవంబరు 1, 1952లో జన్మించారు. ‘కార్తీక్ మాస్ ఇజోరియా’, కోయల్ బిన్’ వంటి జానపద పాటలతో ఆమె పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్-2, బబుల్, హమ్ ఆప్‌కే హై కౌన్ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ పాటలు పాడారు. ఛఠ్ వేడుకలకు సంబంధించిన పాటలతో ప్రఖ్యాతిగాంచారు. బిహార్ కోకిలగా పేరొందిన శారదా సిన్హా 1991లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. మెదడులో నరాలు చిట్లడంతో ఈమె భర్త బ్రజ్ కిషోర్ సిన్హా వారం క్రితమే తుదిశ్వాస విడిచారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శారదా సిన్హా మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం ప్రకటించారు.