బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణ' . నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ దీన్ని రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రెండు పార్టులుగా ఇది రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీలను తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదలకానున్నట్లు వెల్లడించింది.కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కనిపించనున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఈ పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నానని, డైట్ ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. మద్యపానం మానేసినట్లు తెలిపారు. సీత పాత్రలో నటించడం తన అదృష్టమని సాయిపల్లవి తెలిపారు. ''చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథల్లో రామాయణం ఒకటి. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం నా భాగ్యం. భయాన్ని పక్కనపెట్టి.. సీతమ్మగా మారాలని నిర్ణయించుకున్నా. నటిగా కాకుండా భక్తురాలిగా ఆ రోల్ చేస్తున్నా'' అని పేర్కొన్నారు. రావణుడిగా యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక దీని వీఎఫ్ఎక్స్ కోసం నితేశ్ తివారీ టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సినిమాకు తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్రబృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)కు అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమాకు ఎంతో ముఖ్యమైన సంగీతం కోసం చిత్రబృందం ఆస్కార్ విజేతలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ దీనికి ట్యూన్స్ అందించనున్నారట. హన్స్ జిమ్మెర్ హాలీవుడ్‌లోని టాప్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయనకు ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారని.. దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం.