కోలీవుడ్ విలక్షణ నటుడు ఢిల్లీ గణేష్ అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త కలచివేసిందన్నారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ మృతి విచారకరం. దాదాపు 400 చిత్రాల్లో నటించి, తన అద్భుత నటనా ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. భారత వైమానిక దళంలో విధులు నిర్వర్తించి.. దేశభక్తిని చాటుకున్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆయనతోపాటు పలువురు స్టార్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.