‘లక్కీ భాస్కర్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళికి విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా పోస్ట్ పెట్టింది. ఈ నెల 28 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ తెరకెక్కింది. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి సాధారణ బ్యాంకు ఉద్యోగి చేసిన రిస్క్ ఏంటన్నది ఈ సినిమా కథాంశం. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్యతరగతి మనస్థత్వాలు... వీటన్నిటినీ మేళవిస్తూ దర్శకుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. భాస్కర్‌కుమార్ పాత్రలో దుల్కర్ నటన, నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో దుల్కర్‌కు ఇది హ్యాట్రిక్. ‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత ఇప్పుడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆయన కెరీర్‌లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ‘లక్కీ భాస్కర్’ కావడం విశేషం.