మలయాళంలో ఈ ఏడాది ఆరంభంలోనే కాదు, ద్వితీయార్ధంలోను భారీ విజయాలు నమోదవుతూ ఉన్నాయి. అలా ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'పణి'. జోజూ జార్జ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోగా కొనసాగుతున్న జోజూ జార్జ్, తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' దక్కించుకుందనీ, డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. జోజూ జార్జ్ కి భార్య పాత్రలో 'అభినయ' కనిపించనుండటం విశేషం. ఈ సినిమాలో 'గిరి' అనే పాత్రలో జోజూ జార్జ్ నటించాడు. గిరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. భార్య గౌరితో ఆయన జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతని మిత్రుడు అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు. ఆ హత్య ఎవరు చేస్తారు? అది తెలుసుకున్న గిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.