సన్నీలియోన్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'మందిర'. యువన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, నెల తిరక్కముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీలియోన్ టైటిల్ రోల్ పోషించిన కంటెంట్ అనగానే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
రివ్యూ: దర్శకుడు యువన్ రూపొందించిన ఈ సినిమాలో, కథాపరంగా ఎలాంటి కొత్తదనం లేదు. రెండు గంటల నిడివి కలిగిన ఈ కథలో గంటసేపటి వరకూ తెరపై సన్నిలియోన్ కనిపించదు. ఆ గంటసేపటి కథను సిల్లీ కామెడీ సీన్లతో అల్లేసుకుంటూ వెళ్లాడు. సన్నీలియోన్ ఎంటరైన దగ్గర నుంచి అయినా కథ కాస్త సీరియస్ గా సాగుతుందా అంటే అదీ లేదు. కథ .. స్క్రీన్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే, కామెడీ పరంగా ఇటు సతీశ్ .. యోగిబాబు .. రాజేంద్రన్ లకు, గ్లామర పరంగా సన్నీలియోన్ కి క్రేజ్ ఉంది. కానీ కంటెంట్ లో బలం లేకపోవడం వలన, పాత్రలు .. సన్నివేశాలు తేలిపోవడం జరిగింది. రాజగురుగా యోగిబాబు .. మాంత్రికుడిగా రాజేంద్రన్ పాత్రలు పేలవంగా మిగిలిపోతాయి. అటు దెయ్యంగా .. ఇటు యువరాణిగా కూడా సన్నీలియోన్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. దీపక్ డి మెనోన్ ఫొటోగ్రఫీ .. జావేద్ రియాజ్ నేపథ్య సంగీతం .. అరుళ్ సిద్ధార్థ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. తక్కువ బడ్జెట్ లో చేసినప్పటికీ, కంటెంట్ విషయంలో కసరత్తు చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఎక్కడికక్కడ సిల్లీ కామెడీనే నమ్ముకుని ముందుకు వెళ్లారు. అందువలన ఈ సినిమా ఎంతమాత్రం భయపెట్టలేకపోయింది .. ఏ మాత్రం నవ్వించలేకపోయింది.