డిసెంబర్ 15: కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎపిసోడ్‌లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.ఆయన మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందించినట్లు పహడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తానే విచారణకు వస్తానని పోలీసులకు మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ సమయంలో తన గన్ సబ్ మిట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చారు. అయితే మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో.. తమకు సమాచారం లేదని పహడి షరీఫ్ పోలీసులు ఆదివారం స్పష్టం చేయడం గమనార్హం.మంచు ఫ్యామిలీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ క్రమంలో చిన్న కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు.
మరోవైపు జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై పహడి షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దాంతో ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఆ తరుణంలో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇంతలో మోహన్ బాబు అనారోగ్యానికి గురి కావడం.. ఆసుపత్రిలో చేరడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ ప్రచారం అయితే శనివారం ఉదయం జోరందుకొంది. దీంతో తాను అజ్జాతంలోకి వెళ్లలేదని.. ఇంట్లోనే చికిత్స పొందుతున్నానని మోహన్ బాబు.. తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆ కొద్ది సేపటికే మోహన్ బాబును పహడి షరీఫ్ పోలీసులు విచారిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ క్రమంలో తాను అనారోగ్యంతో ఉన్నానని.. అరోగ్యం కుదుటు పడిన అనంతరం విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు మోహన్ బాబు స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం సహకరించాలంటూ పోలీసులు ఆయన్ని కోరడంతో.. విచారణ జరిపారని తెలుస్తుంది.అదే సమయంలో గన్ ఇవ్వాలని కోరగా.. సాయంత్రం గన్ సబ్ మీట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వైరల్ అయినాయి. కానీ ఇంతలో మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని పోలీసులు చెప్పడం పలు సందేహాలకు తావిస్తోందనే వాదన వినిపిస్తోంది.