ఎన్టీ రామారావుతో ఎంతోమంది నిర్మాతలు ఎన్నో సినిమాలు నిర్మించారు. వారిలో కైకాల సత్యనారాయణ తమ్ముడు నాగేశ్వరరావు ఒకరు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామారావును గురించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. "రామారావుగారితో చేస్తున్న మా సినిమా ఫైనల్ షెడ్యూల్ కి వచ్చేసింది. ఆయనకి మిగతా బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఎంత ఇవ్వమంటారు? అని అడిగాము. అప్పుడు రామారావుగారు... ప్రస్తుతం నేను ఒక సినిమాకి ఇంత తీసుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు విషయంలో మీరు కంఫర్టబుల్ గా ఉంటే, అంతే ఇవ్వండి. ఒకవేళ అనుకున్న దానికంటే ఖర్చులు పెరిగిపోయాయని అనుకుంటే మీరు ఎంత తగ్గించి ఇచ్చినా ఫరవాలేదు అని అన్నారు. అప్పటికి ఆయన అడవిరాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు వంటి వరుస హిట్స్ తో ఉన్నారు.ఈ సినిమాల హిట్స్ తరువాత ఆయన ఒక 50 వేలు పెంచారు. అప్పుడు ఆయన తన నిర్మాతలందరినీ పిలిపించి, 'మీకు ఇబ్బంది లేకపోతే ఒక 50వేలు పెంచుదామని అనుకుంటున్నాను' అని అన్నారు... అది ఆయన గొప్పతనం. నిజానికి ఆ సమయంలో ఎంత పెంచినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలా ఆయన నిర్మాతల గురించి ఆలోచించేవారు. నిర్మాతకి ఎంతగా లాభాలు వస్తే, ఆయన అంతగా సంతోషించేవారు" అని చెప్పారు.