రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను ఆయన చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా రౌడీ స్టార్ ఓకే చెప్పాడు. టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకు సక్సెస్‌ను అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా రూపొందబోతుంది. గతంలోనే వీరి కాంబో మూవీని ప్రకటించినా మేకింగ్‌కు కాస్త టైం పట్టింది. ఎట్టకేలకు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదటైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి అదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈసారి కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకున్నారని, విజయ్ దేవరకొండ సైతం ఆ కాన్సెప్ట్ విని ఫిదా అయినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం జనవరి నాలుగో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని, మొదటి షెడ్యూల్ లో విజయ్ పాత్రకు సంబంధించిన ఇంట్రో సీన్ ను అలాగే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ ను షూట్ చేస్తారని టాక్. అన్నట్లు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోసం రాహుల్ సంకృత్యాన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్ ను కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరి కొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. 'ది మమ్మీ', 'ది మమ్మీ రిటర్న్స్' సినిమాల్లో విలన్‌గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ను తెలుగు సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఈ దక్షిణాఫ్రికా నటుడు పాత్ర మెచ్చితే ఏ భాషలో నటించేందుకైనా రెడీగా ఉంటారని తెలుస్తోంది. ఎంతైనా 'రాహుల్ సంకృత్యాన్' దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.