ట్రెండింగ్
Epaper    English    தமிழ்

. 'స్క్విడ్‌ గేమ్‌2' వచ్చేస్తోంది!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 02:46 PM

ఏదైనా ఆటలో ఓడిపోతే, మళ్లీ ఆడి గెలవచ్చు.. కొన్ని ఆటలు గెలిచే వరకూ ఆడవచ్చు.. కానీ, 'స్క్విడ్‌ గేమ్‌'లో ఓడిపోతే, ఎలిమినేట్‌ అయిపోతారు.ఆటలోనే కాదు, భూమ్మీద నుంచి శాశ్వతంగా. 'డబ్బు' కొందరికి అవసరం.. మరికొందరికి వ్యసనం.. ఇంకొందరికి వినోదం.. ఈ మూడు కలిసిన వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌' . 2021లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ థ్రిల్లర్‌ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు, వివిధ అవార్డులను సైతం అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తొలి భాగానికి సీక్వెల్‌గా 'స్క్విడ్‌ గేమ్‌2' డిసెంబరు 26వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌  వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అలరించిన తొలిభాగంలో ఏం జరిగింది. ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ జనాలకు నచ్చడానికి కారణమేంటి? దీన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు పడిన కష్టాలేంటి?


 


జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌ గ్రీన్‌లైట్‌, గోలీలాట, టగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ, ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్‌ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మొదటి ఆట ఆడితే కానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది చివరి వరకు ఆసక్తికరం. కథనం వీక్షకుడికి ఊపిరాడనివ్వదు. చివరి దాకా ఉత్కంఠ రేపే కథనంతో థ్రిల్‌ గురిచేస్తుంది.


ఈ ఆటలో పాల్గొనే పోటీదారులకు వాస్తవ జీవితంలో గడ్డు పరిస్థితులుంటాయి. ప్రధాన పాత్రైన షియెంగ్‌ జీ హున్‌కి భార్యతో విడాకులు అవుతాయి. ఉద్యోగం పోతుంది. లెక్కలేనంత అప్పులు చేస్తాడు. దీనికి తోడు జూదం అతడికి వ్యసనం. అందులోనూ డబ్బులు పోగొట్టుకుంటాడు. రెండో వివాహం చేసుకున్న అతడి భార్య.. కూతురిని కూడా తనతో పాటే అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంటుంది. కూతురిని తన సంరక్షణలోకి తెచ్చుకోడానికి డబ్బు కావాలి. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి బెదిరింపులు, కూతురు తనకు దక్కదేమోనన్న భయం.. ఈ రెండు కారణాలతో ప్రమాదకరమైన 'స్క్విడ్‌గేమ్' ఆటలోకి అడుగుపెడతాడు. అక్కడ తన క్లాస్‌మేట్‌ సాంగ్‌ వూ కలుస్తాడు. ఒంటరిగా పోరాటం చేయడం కన్నా.. కలిసికట్టుగా ఆడితే విజయం సాధించొచ్చని ఇతర ఆటగాళ్లు అలీ, ఇల్‌ నామ్, యోంగ్‌-షుతో కలిసి జట్టుగా ఏర్పడతారు. ఈ పోరాటంలో ఒకరికొకరు అండగా నిలబడతారు. కొన్నిసార్లు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్‌ ఆద్యంతం భావోద్వేగాల ప్రయాణంలా సాగి చూసే ప్రేక్షకుడికి కళ్లని తడిపేస్తుంది. ఈ పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉండడం కూడా ఈ వెబ్‌ సిరీస్‌ విజయానికి మరో కారణం.


పూర్వం గ్లాడియేటర్‌ యుద్ధాల గురించి మనకు తెలిసిందే. రాజులు, చక్రవర్తులు వినోదం కోసం బానిసలతో చావు ఆట ఆడేవారు. దానికి ఆధునిక రూపమే ఇది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టించుకుంటారు. ఇందులో అప్పులపాలైన సామాన్యులే వారికి పావులు. డబ్బుల కోసం వాళ్లు కొట్టుకు చస్తుంటే.. అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. కావాల్సినంత డబ్బు సంపాదించిన తర్వాత బోర్‌ కొట్టి ఇలాంటి హింసాత్మక పోటీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రహస్య దీవిని ఎంచుకుంటారు. పోటీల కోసం విశాలమైన మైదానాలను అన్ని హంగులతో భారీగా నిర్మిస్తారు. తొలుత ఎంతో అందంగా, స్వర్గంలో ఉన్నట్లు కనిపించే ఆ ప్రదేశం... ఆ తర్వాత పోటీదారుల నెత్తుటితో తడిసి నరకం కన్నా భయంకరమైన ప్రదేశంగా మారుతుంది.


ఓటీటీ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్‌సిరీస్‌.. దృశ్యరూపం దాల్చడానికి మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది. దీన్ని దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ తెరకెక్కించాడు. 'స్క్విడ్‌గేమ్‌' కథను 2009లోనే రాసుకున్నాడు. వెబ్‌ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాత్రం పదేళ్లు పట్టింది. ఇంత కాలం పట్టడానికి ఆర్థికంగా ఆయనను వెంటాడిన కష్టాలు కూడా కారణమే. డబ్బుల్లేక ల్యాప్‌టాప్‌ అమ్మేసి జీవితాన్ని నెట్టికొచ్చిన సందర్భాలున్నాయి. స్క్రిప్ట్‌తో ఏ స్టూడియోకి వెళ్లినా తిరస్కరణే ఎదురయ్యేది. 'చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారు' అని మొహం మీదే తలుపులేసిన వారున్నారు. నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. ఇప్పుడు తొలి సీజన్‌కు కొనసాగింపుగా 'స్క్విడ్‌ గేమ్‌2' స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com