ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీర మల్లు' నుండి క్రేజీ అప్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 06:00 PM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' ఒకటి. జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. అయితే కొత్త విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తద్వారా విడుదల తేదీపై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు."అచంచలమైన ఓపిక మరియు నమ్మకంతో 'హరి హర వీరమల్లు' సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము. కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి యొక్క ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాం. మీ నిరీక్షణకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం.మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాం. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్ డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి.'హరి హర వీరమల్లు' చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు. ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.'హరి హర వీరమల్లు' యొక్క భారీ మరియు శక్తివంతమైన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాం. కాబట్టి భారీ ప్రకటన కోసం వేచి ఉండండి. సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ట్రైలర్ ను మీతో పంచుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. మీ నిరంతర మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తుపాను అతి త్వరలో రాబోతోంది. చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది" అంటూ చిత్రబృందం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa