ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తలనే కిరాతకంగా హతమార్చిన భార్యల కథలు..

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 11, 2025, 02:36 PM

పెళ్లి అంటే నమ్మకం.. ఏడడుగులతో ప్రారంభించే జీవితకాల ప్రయాణం. కానీ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని హత్యలు ఈ నమ్మకాన్నే ప్రశ్నిస్తున్నాయి. ప్రియుళ్ల కోసం.. కట్టుకున్న భర్తలనే కిరాతకంగా హతమార్చిన భార్యల కథలు ప్రజల గుండెల్ని పిండేస్తున్నాయి. కొన్ని నెలల వ్యవధిలో ఇటువంటి ఎన్నో ఘటనలు జరిగాయి. వాటిలో 4 షాకింగ్ కేసుల వివరాలు చూద్దాం..మీరట్ ‘డ్రమ్’ మర్డర్మీ రట్‌లో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్ తన ప్రియుడు సాహిల్‌తో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఏడాది మార్చి 4న సౌరభ్‌కు మత్తుమందు ఇచ్చి చంపేశారు. అతని శరీరాన్ని 15 ముక్కలుగా నరికి, సిమెంట్ నింపిన ఓ నీలి డ్రమ్‌లో వేసి ఇంట్లోనే దాచిపెట్టారు. “పాపా డ్రమ్‌లో ఉన్నారు” అని చిన్నారి తన అమ్మమ్మతో చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 15 రోజులకే బుల్లెట్ దింపింది ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో పెళ్లైన పదిహేను రోజులకే ఓ నవ వధువు తన భర్తను కిరాతకంగా హత్య చేయించింది. దిలీప్ యాదవ్ (25)ను అతని భార్య ప్రగతి.. తన ప్రియుడు అనురాగ్‌తో కలిసి హత్య చేయాలని ప్లాన్ వేసింది. పెళ్లైన కొన్ని రోజులకే ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకుని, మార్చి 5న భర్తను కాల్చి చంపించింది. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడం వల్లే దిలీప్ చనిపోయాడని రిపోర్టులో తేలింది.  హరియాణాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ప్రియుడి కోసం భర్త ప్రాణాలు తీసింది. ఇన్‌ఫ్లుయెన్సర్ రవీనాకు సురేశ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త ప్రవీణ్‌కు తెలియడంతో గొడవ మొదలైంది. గొడవ పెద్దదవడంతో, రవీనా తన చున్నీతోనే భర్త మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ప్రియుడు సురేశ్‌తో కలిసి మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మూడు రోజుల తర్వాత మృతదేహం లభించగా, నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఇప్పుడు హనీమూన్‌లో హత్య ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన హత్యల్లో ఇది ఒకటిగా నిలిచింది. హనీమూన్‌లో భర్తను భార్యే హత్య చేయించింది. రాజా రఘువంశీ, సోనం అనే నవ దంపతులు మే 11న పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. జూన్ 2న సోహ్రాలోని ఓ లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. భార్య సోనం కనిపించకుండా పోవడంతో కేసు మిస్టరీగా మారింది. చివరికి సోనం ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. తానే కిరాయి హంతకులతో భర్తను చంపించినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలు కేవలం నేరాలు మాత్రమే కాదు. ప్రేమ, నమ్మకం, విశ్వాసం వంటి వైవాహిక బంధంలోని పునాదులనే కదిలిస్తున్నాయి. “అసలు ఎవరిని నమ్మాలి?” అనే ప్రశ్నను ప్రతి ఒక్కరి మదిలో రేకెత్తిస్తున్నాయి. ఈ హత్యల వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa