ఒక్క పాటతో ఇంటర్నెట్‌లో అభిమానులను సంపాదించుకున్నారు రేణూ మోండల్. ఆమె రైల్వేస్టేషన్‌లో పాడిన పాట వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆమె స్వరానికి శ్రోతలు ఫిదా అయ్యారు. రైలులో ప్రయాణిస్తూ కాలక్షేపం కోసం ఆమె పాడిన పాట ఇప్పుడు సోషల్‌మీడియా సెన్సేషనల్ సెలబ్రిటీని చేసింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేషమ్మియా తాను తెరకెక్కిస్తున్న సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. ఆమె పాట పాడుతున్న వీడియోను ఇటీవల ఆయన షేర్ చేశారు.
కాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఈ ఇంటర్నెట్ కోయిల రేణూకు రూ.55లక్షలు విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నైపుణ్యం సల్లూభాయ్‌ను మెప్పించిందట. కానీ ఈ విషయాన్ని సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు. సల్మాన్ నటిస్తున్న ‘దబాంగ్-3’లో ఆమెతో ఓ పాటను పాడించా లనుకుంటున్నట్లు సమాచారం. గతంలో కూడా అనేక సందర్భాల్లో అవసరమైన వారికి సాయం చేసి సల్మాన్ తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే.
