దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Food Safety and Standards Authority of India రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారీ స్థాయిలో తనిఖీలు, అమలు చర్యలను వేగవంతం చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 3.97 లక్షల ప్రదేశాలను తనిఖీ చేయగా, 1.65 లక్షలకు పైగా ఆహార నమూనాలను పరీక్షించారు.ఈ నమూనాల్లో దాదాపు 17 శాతం నాణ్యత ప్రమాణాలకు సరిపోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ మొత్తం 23,580 కేసులను పరిష్కరించారు. వీటిలో 1,756 కేసుల్లో శిక్షలు అమలు చేయగా, సంబంధిత సంస్థలపై రూ.154.87 కోట్ల జరిమానాలు విధించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే 945 ఆహార ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించారు.దేశంలో ఆహార వ్యాపారాల్లో సుమారు 98 శాతం రాష్ట్రాల పరిధిలోనే ఉండటంతో, అమలు బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో వీధి ఆహార విక్రేతలను కూడా నియంత్రణలోకి తీసుకురావడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది 10 లక్షలకు పైగా స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను నిబంధనల పరిధిలోకి తీసుకురావడం గమనార్హం.ఇక లైసెన్సింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేశారు. వ్యాపార పరిమాణాన్ని బట్టి ప్రాథమిక నమోదు, రాష్ట్ర లైసెన్స్, కేంద్ర లైసెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆహార పరీక్షలను బలోపేతం చేయడానికి సిక్కిం, ఆంధ్రప్రదేశ్ సహా 18 ఆధునిక ప్రయోగశాలలకు అనుమతి ఇచ్చారు.ఇదిలా ఉండగా, FSSAI దర్యాప్తుకు సంబంధించిన సమాచారం లీక్ అయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఏ మీడియా సంస్థలపై కాకుండా, రహస్య సమాచారాన్ని బయటపెట్టిన వ్యక్తులను గుర్తించడానికే నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు గోప్యతను కాపాడడం, ఇలాంటి లీకేజీలను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa