by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:30 PM
కడప పెద్ద దర్గాలో నిర్వహించిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా రామ్‌చరణ్ హాజరైన విషయం తెలిసిందే. స్వామి మాలలో ఉన్న ఆయన దర్గాను సందర్శించడంపై పలువురు విమర్శలు చేశారు. దీనిపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అసహనం వ్యక్తంచేశారు. సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వస్తోన్న వేళ.. ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తుంటారని ఉపాసన పేర్కొన్నారు.‘‘దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది. చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేము అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు’’ అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్.. వన్ స్పిరిట్’ అని ఆమె హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.సినిమాల విషయానికి వస్తే.. చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. జనవరి 10న ఇది విడుదల కానుంది. మరోవైపు, త్వరలో ఆయన బుచ్చిబాబుతో మూవీ పట్టాలెక్కించనున్నారు. ఈనేపథ్యంలోనే బుచ్చిబాబుతో కలిసి దర్గాలో జరిగిన ఈవెంట్‌కు వచ్చారు. ‘‘నా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘మగధీర’. ఆ సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు ఈ దర్గాకు వచ్చా. ఇక్కడి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నా. నాకు మంచి స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటా. బుచ్చిబాబుతో చేయనున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనే నాకు ఈ కార్యక్రమం గురించి చెప్పారు. కచ్చితంగా ఈ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు వస్తానని రెహమాన్‌కు మాటిచ్చా. అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ ఆయనకు ఇచ్చిన మాట తప్పకూడదని ఇక్కడికి వచ్చా. ఎంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు సమీపంలోని విజయదుర్గాదేవి ఆలయంలో చరణ్ - బుచ్చిబాబు ప్రత్యేక పూజలు చేశారు.
Latest News