దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం.. తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ భవేజాకు సంచలన లేఖ రాశారు. స్వయంగా తన చేతిరాతతో ఒక నోట్‌బుక్‌లో రాసిన నాలుగు పేజీల లేఖను కవిత రాయగా... అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత లేఖలో ఆరోపించారు. ఈ లిక్కర్ పాలసీతో ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి కూడా చేకూరలేదని కవిత చెప్పుకొచ్చారు. కేవలం స్టేట్‌మెంట్ల ఆధారంగానే తనను రెండున్నరేళ్లుగా వేధించి చివరకు అరెస్టు చేశారని ఈడీపై దుమ్మెత్తిపోచారు. తన చిన్న కుమారుని పరీక్షల సమయంలో తోడు లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశమంతా రెండున్నరేళ్లుగా ఈ కేసు దర్యాప్తు చూస్తోందని. ఈడీ, సీబీఐ దర్యాప్తు అంతులేని కథగానే ఉండిపోయిందన్నారు. చివరకు ఈ కేసు విచారణ మీడియాలో జరుగుతోందన్నారు. మహిళా పొలిటీషియన్‌గా ఈ మొత్తం దర్యాప్తులో తాను ఓ బాధితురాలినన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి ఇది ఓ మాయని మచ్చగా చెప్పుకొచ్చారు. చివరకు నా మొబైల్ నెంబర్ కూడా టీవీ ఛానెళ్లలో ప్రత్యక్షమై.. తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత ఆరోపించారు.
ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తులో తాను పూర్తి స్థాయిలో సహకరించి తనకు తెలిసినవన్నీ వెల్లడించానని కవిత తెలిపారు. తన బ్యాంకు లావాదేవీలను, వ్యాపార వివరాలను కూడా అందించానని చెప్పుకొచ్చారు. కానీ.. తాను ఫోన్లు ధ్వంసం చేశానని, ఆధారాలను మాయం చేశానంటూ.. పదేపదే తనను నిందిస్తున్నారని ఆరోపించారు. రెండు దర్యాప్తు సంస్థల అధికారులు తన ఇంట్లో తనిఖీలు చేశారని.. తనను పలుమార్లు ప్రశ్నించారని లేఖలో కవిత పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చారని.. బెదిరించారని, చివరకు తనను అరెస్టు చేశారని కవిత చెప్పుకొచ్చారు.
కేవలం పలువురు ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారని కవిత ఆరోపించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా "మనీ ట్రయల్ లేదు... అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవ్... ఇది నిలిచే కేసు కాదు.." అన్నారని కవిత వ్యాఖ్యానించారు. ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడబోమంటూ సుప్రీం కోర్టులో చెప్పి.. మాట తప్పారన్నారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను మార్చి 15న అరెస్టు చేశారని మండిపడ్డారు. . ఈ కేసులో తన పాత్ర ఉన్నట్లయితే.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో దాదాపు 95 శాతం దేశంలోని ప్రతిపక్ష పార్టీ నేతలపైనే ఉన్నాయని కవిత ఆరోపించారు. బీజేపీలో చేరిన వెంటనే వారిపైన నమోదైన కేసులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు వేదికగానే పలువురు బీజేపీ లీడర్లు ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారనన్నారు. సైలెంట్‌గా ఉండండి... లేదంటే ఈడీని పంపిస్తాం.. అని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారన్నారు. ఈ కారణంగానే ప్రతిపక్ష లీడర్లు న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తున్నారనరన్నారు.
లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేకపోయినా దర్యాప్తు సంస్థలకు పద్ధతి ప్రకారం సహకారం అందిస్తున్నానని లేఖలో కవిత పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అరెస్టయి.. జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి చదువును దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని... ఒక తల్లిగా తనకు ఇది ఒక బాధ్యత అని గుర్తు చేశారు. ఉన్నత విద్యావంతురాలిగా తన కుమారుడు బోర్డు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ పరీక్షల సమయంలో తోడుగా ఉండడం అవసరమన్నారు. తాను లేకపోవడం ఆ అబ్బాయి మానసిక ప్రవర్తనలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందంటూ కవిత తన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa