హైదరాబాద్‌లో ఆర్టీసీ మహిళా కండక్టర్ మానవత్వాన్ని చాటుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణీకి ఒక్కసారిగా పురిటి నొప్పులు రావటంతో.. సమయస్పూర్తిగా వ్యవహరించి ప్రసవం పోసింది. దీంతో.. తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడింది. ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ చేసిన ఈ గొప్ప పనికి.. ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆరంఘర్ నుంచి 1-జెడ్ బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ సికింద్రాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలోనే.. బస్సు బహదూర్ పురాకు వచ్చిన రాగానే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వేతకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. మిగతా ప్రయాణికులు ఈ విషయాన్ని కండక్టర్‌కు తెలియజేయగా.. ఆమె వెంటనే స్పందించారు. బస్సును పక్కన ఆపాలని డ్రైవర్‌కు సూచించారు. బస్సును పక్కకు ఆపటంతోనే.. ప్రయాణికులందరినీ కిందికి దింపేశారు. తోటి మహిళా ప్రయాణికుల సహాయంలో.. కండక్టర్ సరోజనే స్వయంగా ఆ గర్భిణీకి డెలివరీ చేశారు. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఆ మహిళ.. బస్సులోనే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వెంటనే.. అదే బస్సులో.. తల్లి బిడ్డలను క్షేమంగా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ సంఘటన చూసిన తోటి ప్రయాణికులంతా.. ఆ డ్రైవర్, కండక్టర్‌ని అభినందించారు. అయితే.. సమయస్ఫూర్తితో బస్సులోనే ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ అభినందనలు తెలియజేశారు. సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. ఆర్టీసీ సిబ్బంది ఇలాంటి సేవా స్ఫూర్తిని చాటుతుండటం ప్రశంసనీయమని సజ్జనార్ కొనియారు.
బస్సులోనే గర్భిణీకి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆపదలో ఉన్న గర్భిణీకి సాయం చేసి ఆర్టీసి బస్సులో ప్రసవం చేసిన సిబ్బందికి, మహిళా ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. తల్లీబిడ్డకు సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది కూడా ముందు నిలవడం అభినందనీయమని పొన్న ప్రభాకర్ తెలిపారు.
ఇటీవలే.. కరీంనగర్ బస్టాండ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణీకి బస్టాండ్ ఆవరణలోనే చీరలు అడ్డుగా కట్టి ఆర్టీసీ సిబ్బంది ప్రసవం చేశారు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టీలో చేసే ఒడిశాకు చెందిన వలస కూలీలు.. వేరే గ్రామానికి వెళ్లేందుకుగాను కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. నెలలు నిడటంతో.. బస్టాండుకు రాగానే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భార్య తల్లడిల్లిపోవటం చూడలేక.. ఆర్టీసీ అధికారులను సాయం చేయాలని భర్త వేడుకున్నాడు. వెంటనే 108కు సమాచారమివ్వగా... అంబులెన్స్ వచ్చేలోపు మహిళకు పురిటి నొప్పులు ఎక్కువకావడంతో.. ఆర్టీసీ సిబ్బంది అంతా కలిసి.. చీరలను అడ్డుగా కట్టి.. ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. అక్కడ కూడా మహాలక్ష్మే పుట్టటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa