ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుల రిజర్వేషన్లుపై స్మితా సబర్వాల్ ట్వీట్,,,.. దేశం మొత్తం దుమారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 08:13 PM

అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీస్ నిబంధనలపై ఐఏస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే.. అంత్యత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ప్రశ్నించారు. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకని.. డెస్కుల్లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు స్మితా సబర్వాల్.


ఈ క్రమంలోనే.. ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయటంపై స్పందించిన స్మితా సబర్వాల్.. బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని ట్వీట్ చేశారు. అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ సంచలన పోస్ట్ పెట్టారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా దుమారం రేపుతోంది. స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తన్నారు. స్మితా సబర్వాల్ అభిప్రాయాన్ని తప్పుపడుతున్న వారికి కూడా స్మితా సబర్వాల్ రిప్లైలు ఇస్తూ వివరిస్తుండటం గమనార్హం.


స్మితా సబర్వాల్ ట్వీట్‌పై స్పందిస్తూ.. అఖిల భారత సర్వీసెస్‌లో వెనుకబడిన తరగతులకు చెందిన అధికారుల వారసులకు రిజర్వేషన్లు ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అసలు రిజర్వేషన్లు ఇవ్వొద్దని సమాధానం ఇచ్చారు స్మితా సబర్వాల్. కాగా.. పలువురు స్మితా సబర్వాల్ తీసుకున్న స్టాండ్‌కు మద్దతు కూడా తెలుపుతున్నారు. అయితే.. మొట్టమొదటిసారిగా స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌కు వ్యతిరేకత వస్తుండటం గమనార్హం. ఎంత వ్యతిరేకత వచ్చినా.. తాను మాత్రం తన అభిప్రాయం పట్ల స్పష్టంగా, దృఢంగా నిలబడే ఉన్నారు స్మితా సబర్వాల్.


పూజ్ ఖేద్కర్ వ్యవహారంలో సమగ్ర విచారణకు ఆదేశిస్తున్న ఉత్తర్వులు జారీ చేయటాన్ని స్వాగతించిన స్మితా సబర్వాల్.. ఈ చర్య లక్షల మంది విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఇది ఇక్కడితో ఆగదని ఆశిస్తున్నట్టు తెలిపారు. సేవలందిస్తున్న అధికారుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్మితా సబర్వాల్ సూచించారు. అయితే.. ఈ పోస్ట్‌పై స్పందించిన ఓ మాజీ ఐఏఎస్‌.. ఒక కోయిల కూతతో వేసవి రాదని.. వైద్యపరంగా వికలాంగులు, దిగువన ఉన్న అన్ని క్రీమీ లేయర్ క్లెయిమ్‌ల సమగ్ర సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు.


ఆయన ట్వీట్‌పై స్పందించిన స్మితా సబర్వాల్.. "ఒప్పుకోలేకపోతున్నాను సార్..! మొత్తం సేవల విశ్వసనీయత ప్రమాదంలో ఉంది. మీలాంటి బలమైన స్వరాలు వ్యవస్థను లోతుగా ప్రక్షాళన చేస్తాయి. మెజారిటీ అధికారులు ఏ పరిశీలనకైనా అంగీకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. వారు దాచడానికి ఏదైనా ఉంటే తప్ప." అంటూ తనదైన శైలిలో స్పందించారు స్మితా సబర్వాల్.


తన ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంటున్న నేపథ్యంలో.. దివ్యాంగులకు కచ్చితంగా గౌరవం దక్కల్సిందే అని చెప్పిన స్మితా సబర్వాల్.. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది.. ప్రజల మనోవేదనలను నేరుగా వినడానికి శారీరక దృఢత్వం అవసరని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యంత కీలకమైన సర్వీస్‌కి ఈ కోటా ఎందుకు అని ప్రశ్నించారు.


కాగా.. స్మితా సబర్వాల్ వివరణపై స్పందించిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వోకేట్‌.. ఒక ఐఏఎస్‌ అధికారికి వైకల్యం గురించి అంతగా అవగాహన లేకపోవటంపై విస్మయం వ్యక్తం చేశారు. చాలా వైకల్యాలు తమ సామర్థ్యంపై, తెలివితేటలపై ప్రభావం చూపవని చెప్పుకొచ్చారు. కానీ ఈ ట్వీట్ జ్ఞానోదయం, వైవిధ్యం చాలా అవసరం అని చూపిస్తుందంటూ సెటైర్ వేశారు.


సీనియర్ మహిళా అడ్వొకేట్ ట్వీట్‌పై స్పందించిన స్మితా సబర్వాల్.. "మేడమ్ నాకు ఉద్యోగ అవసరాల గురించి ప్రాథమికంగా తెలుసు. ఇక్కడ సమస్య క్షేత్రస్థాయిలో ఉండే ఉద్యోగానికి అనుకూలత గురించి. అలాగే డెస్క్/థింక్ ట్యాంక్ స్వభావం వంటి ప్రభుత్వంలోని ఇతర సేవలు బాగా సరిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి కన్‌క్లూజన్‌కు వెళ్లొద్దు. చట్టపరమైన ఫ్రేంవర్క్ అనేది సమానత్వ హక్కుల యొక్క మొత్తం రక్షణ కోసం. అక్కడ చర్చ లేదు." అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.


స్మితా సబర్వాల్ అభిప్రాయాలపై శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. "ఇది చాలా దయనీయమైన వీక్షణ. బ్యూరోక్రాట్‌లు తమ పరిమిత ఆలోచనలను, వారి ప్రత్యేకాధికారాలను కూడా ఎలా చూపిస్తున్నారో చూడటం ఆసక్తికరంగా ఉంది." అంటూ విమర్శించగా.. "మేడమ్.. తగిన గౌరవంతో, బ్యూరోక్రాట్‌లు పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే, ఎవరు మాట్లాడతారు..? నా ఆలోచనలు, నా ఆందోళన.. 24 సంవత్సరాల అనుభవం నుంచి వచ్చాయని.. నాకేమీ పరిమిత అనుభవం లేదు. దయచేసి తన వీక్షణను పూర్తిగా చదవండి. ఇతర కేంద్ర సేవలతో పోలిస్తే AISకి భిన్నమైన డిమాండ్లు ఉన్నాయని నేను పేర్కొన్నాను. ప్రతిభావంతులైన వికలాంగులు కచ్చితంగా గొప్ప అవకాశాలను పొందవచ్చు." అంటూ స్మితా సబర్వాల్ తన వాయిస్‌ను గట్టిగానే వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa