నాటి ప్రధాని నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్.. నెహ్రూ సంస్కరణల వల్లే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధానులు లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తీసుకొచ్చారని కొనియాడారు.
కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలే అని చెప్పుకొచ్చారు. ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన దేశ స్వాతంత్ర్య పోరాటమన్నారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమైనట్లు వెల్లడించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయబోమని తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీ మేరకు ప్రస్తుతం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతల మాఫీ అయిందని.. నేడు మూడో విడత మాఫీ చేయనున్నట్లు చెప్పారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారని.. కానీ తమ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు అమలు చేసి చూపిస్తుందన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదని.. అలాంటి వారిని గుర్తించి అందజేయనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని.. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాతీయపతాకావిష్కరణ అనతరం గోల్కొండ కోటలో నిర్వహించిన సంబురాల్లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa