ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. 4 లక్షల్లోనే 4 గదుల ఇల్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 09:11 PM

కూలీ చేసుకుంటూ పూట గడుపుతున్న నిరుపేదకైనా.. గౌరవప్రదమైన జీతం తీసకునే ఉద్యోగికైనా.. ఎవ్వరికైననా సొంతిళ్లు అనేది ఓ కల. తాను ఉద్యోగం చేస్తున్న చోట.. ఓ ఇళ్లు కట్టుకుని స్థిరపడాలనేది ఓ లక్ష్యం. అయితే.. ప్రస్తుతం ఉన్న భూములు, ఇండ్ల ధరలు చూస్తుంటే.. మధ్యతరగతి ప్రజలే మావల్ల కాదు బాబోయ్ అనుకుంటుంటే.. ఇక పేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టాలంటే.. ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 10 లక్షలైనా ఖర్చవుతుంది. కానీ.. కేవలం 4 లక్షలకే డబుల్ బెడ్ రూం కట్టిస్తామంటే.. నమ్మగలరా..?


 అదే చేసి చూపించారు హైదరాబాద్‌లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిపుణులు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేవలం 4.04 లక్షల ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఈ డబుల్ బెడ్ రూం ఇంటిని రూపొందించినట్టు తెలిపారు. ఈ ఇంటిని మిగతావాళ్లు కూడా నిర్మించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నిర్మాణంపై త్వరలోనే మేస్త్రీలు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ ఇస్తామని తెలిపారు.


అయితే.. ఈ చవకైన డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం కాస్తా ఆసక్తికరంగానే ఉంది. ఈ ఇంటి పునాది కోసం ఎప్పటిలాగే బండరాళ్లు ఉపయోగించారు. వాటిపైన ఇటుకలతో స్తంభాలు నిర్మించారు. అయితే.. స్తంభాల మధ్యలో వెదురు బొంగులు అమర్చి చుట్టూ.. సిమెంటు పూత పూయడం ద్వారా గోడలు నిర్మించారు. ఈ గోడలపైన.. ఇనుప కమ్ములు, కంకర, సిమెంట్‌ మిశ్రమంతో బీమ్‌లు ఏర్పాటు చేశారు. కుమ్మరి గూనలతో గుమ్మటం ఆకారంలో పైకప్పు వేశారు. వర్షానికి ఉరవకుండా పైకప్పును సిమెంటుతో అలికి, విరిగిన టైల్స్‌ అతికించారు.


ఇక.. ఫ్లోరింగ్‌ కోసం తాండూరు రాళ్లను ఉపయోగించారు. ఆవు పేడ ఆధారిత సహజ రంగులతో వెల్ల వేశారు. పెంకులతో పైకప్పు నిర్మించడం, వెదురుబొంగులతో గోడ నిర్మాణం వల్ల ఇల్లు పర్యావరణహితంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా నిర్మించటం వల్ల.. చలికాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంటుందని.. వేసవికాలంలో చల్లగా ఉంటుందని పేర్కొన్నారు.


కేవలం 4 లక్షల్లో నిర్మాణమయ్యే నమూనా ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు ఉండవనుకుంటున్నారో ఏమో.. 409.05 చదరపు అడుగుల్లో నిర్మించే ఈ ఇంట్లో.. 77.50 చదరపు అడుగుల్లో హాలు, 49 చ.అ.లో వంటగది, 80.83 చ.అ.లో పడక గది.. 23.56 చ.అ.లో అటాచ్ బాత్రూం, 78.14 చ.అ.లో ఇంకో పడక గది, దానికి అనుబంధంగా 16.88 చ.అ.లో అటాచ్ బాత్రూం ఉంటుంది. అంతేకాకుండా.. 30.02 చ.అ.లో దుస్తులు ఉతుక్కునే ప్రాంతం కూడా ఉంటుంది. మొత్తంగా.. ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి కేవలం 987 రూపాయలు ఖర్చయినట్టు నిపుణులు చెప్తున్నారు.


ఇంకేందుకు ఆలస్యం.. స్థలం ఉన్న వాళ్లు అతి తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకునేవారు.. ఈ పద్ధతిని ఫాలో అయితే. ఖర్చు తక్కువ మాత్రమే కాదు.. పర్యావరణహితమైన ఇల్లు కూడా సిద్ధమైపోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలను గమనిస్తే.. ఇది 100కు వెయ్యి శాతం బెటర్ ఆప్షన్ అవుతుంది. అయితే.. మరి ఈ ఇంటి నిర్మాణం ట్రైంనింగును అధికారులు ఎప్పుడు మొదలుపెడతారు.. ఎవరెవరికీ ఇలాంటి ఇళ్లు కట్టించి ఇస్తారన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa