రాజకీయ నేతలను, పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, శని ఆది వారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని నిలదీసింది. కరుడుగట్టిన నేరస్థుడిని ఉరితీసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని గుర్తుచేస్తూ.. ఇంటిని కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించింది. ఈమేరకు హైడ్రా కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం ఉదయం విచారణ చేపట్టింది. హైడ్రా చీఫ్ వర్చువల్ గా, అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఆదివారం సెలవుదినం.. అలాంటిది సెలవు దినాలలో మీరు ఎందుకు పనిచేస్తున్నారని రంగనాథ్ ను హైకోర్టు ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో అదికూడా సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని నిలదీసింది. గతంలో వారాంతంలో కూల్చివేతలు చేపట్టవద్దంటూ కోర్టులు తీర్పిచ్చిన విషయం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టప్రకారం నడుచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను హెచ్చరించింది. రాజకీయ నేతలు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో అత్యుత్సాహంతో పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడతారంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది.
ఆదివారం కూల్చివేతలు చేపట్ట వచ్చా అని హైకోర్టు ప్రశ్నించగా.. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బంది కావాలని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ జవాబు చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన ప్రశ్నకు నేరుగా జవాబివ్వాలని హెచ్చరించింది. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని అడిగింది. ఆక్రమణదారులు ఇల్లు ఖాళీ చేయనంతమాత్రాన కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అంటూ మండిపడింది. చట్ట ప్రకారం నడుచుకోకుంటే ఇంటికి వెళతారు జాగ్రత్త.. అంటూ అధికారులను హెచ్చరించింది.
హైడ్రాకు ఉన్న విధుల్లో ఆక్రమణల తొలగింపు కూడా ఒకటని, కేవలం ఇదొక్కటే హైడ్రా డ్యూటీ కాదని హైకోర్టు పేర్కొంది. జీవో ప్రకారం నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా హైడ్రాకు ఉందని, మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించింది. అమీన్ పూర్ కూల్చివేతలతో పాటు మూసీ విషయంలోనూ 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఇది అరుదైన కేసుగా భావించి అధికారులను విచారణకు పిలిచినట్లు తెలిపింది. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
చట్టప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, స్థానిక సంస్థల అనుమతి తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తుచేసింది. అయితే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. కానీ దాని పనితీరుపైనే తమ అభ్యంతరమని కోర్టు పేర్కొంది. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదని, ఎఫ్ టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలను ఎలా తేలుస్తారని నిలదీసింది. అనంతరం కేసు విచారణను ఈ అక్టోబర్ 15 కు వాయిదా వేస్తూ అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa