ఇటీవల కాలంలో అమ్మాయిలు, మహిళలపై వరుస అత్యాచారాలు, వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా సమాజంలో వారికి వేధింపులు తప్పటం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న డీపీలను మార్ఫింగ్ చేసి నగ్నంగా తయారు చేస్తున్నారు. వాటిని షేర్ చేస్తూ.. వేధింపులకు పాల్పడుతున్నారు.
అమ్మాయిలకే కాదు ప్రస్తుతం అబ్బాయిలకూ వేధింపులు తప్పటం లేదు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ యువకుడిని గుర్తు తెలియని అగంతకుడు వేధింపులకు గురి చేశాడు. నగ్న ఫోటోలు పంపాలంటూ నరకం చూపించాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ యువకుడు (29) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ నిపుణుడిగి పని చేస్తున్నాడు. అయితే గత జులైలో గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టెకీతో పరిచయం పెంచుకున్నాడు. బర్త్‌డే విషెస్ చెప్పేందుకు ఫోన్ నెంబర్ సైతం తీసుకున్నాడు. అలా నెంబర్ తీసుకున్న ఆగంతకుడు తరచూ కాల్ చేస్తూ యువకుడిని ఇబ్బంది పెట్టేవాడు.
సదరు యువకుడు ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్టులకు అసభ్య కామెంట్లు పెట్టేవాడు. న్యూడ్ ఫోటోలు పంపాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్‌లో నెంబర్లు బ్లాక్ చేస్తే వేర్వేరు నెంబర్లు, అకౌంట్ల నుంచి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించి తీవ్రంగా వేధింపులకు గురిచేసేవాడు. తన సోషల్ మీడియా అకౌంట్లను అన్‌బ్లాక్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు గత్యంతరం లేక వాటిని అన్‌బ్లాక్ చేయడంతో మళ్లీ వేధించటం మెుదలు పెట్టాడు.
తాను చెప్పినట్లుగా వినాలని, తనతో అసభ్యంగా, న్యూడ్‌గా మాట్లాడాలంటూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు. బాధితుడి తండ్రి, సోదరులకు సైతం ఫోన్లు చేసి.. 'మీ అబ్బాయికి ఫ్రెండ్‌ని.. నన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు.. అన్‌బ్లాక్ చేయమని చెప్పండి.. లేదంటే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తా' అని బెదిరించాడు. అగంతకుడి వేధింపులు ఎక్కువ కావటంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa