ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:21 PM

తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 8 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈశాన్య రుతుపవనాలు క్రమంగా దక్షిణంవైపు పయనిస్తున్నాయి. ప్రస్తుతానికి అవి తెలుగు రాష్ట్రాలకు తాకకపోయినా.. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఉంది. ఇది బంగ్లాదేశ్, బెంగాల్ తీరాలను ఆనుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అరేబియా సముద్రం దగ్గర కూడా ఓ తుపాను తరహా వాతావరణ ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు.


నేడు వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్, మేడ్చల్, వికారాబాద్, జోగులాంబ గ‌ద్వాల్, నిజామాబాద్, రాజ‌న్న సిరిసిల్ల, సిద్దిపేట‌, సంగారెడ్డి, మెద‌క్, నాగ‌ర్‌ క‌ర్నూర్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. భారీ ఈదురు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ నెల 6న గ‌ద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


ఈనెల 7న మేడ్చల్ మల్కాజిగిరి, భూపాల‌ప‌ల్లి, సిద్దిపేట‌, యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్, ములుగు, కొత్తగూడెం, మ‌హబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, నాగ‌ర్‌క‌ర్నూల్, నారాయ‌ణ‌పేట, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


హైద‌రాబాద్‌లో ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంట‌ల తర్వాత చల్లని గాలులతో కూడిన వర్షం పడొచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత.. వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులు మెుత్తం జలమయమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa