ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్నా చెల్లెల్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:58 PM

కంటికి రెప్పలా కాచుకునే తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అయినా గుండెధైర్యం చేసుకున్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించింది. బీడీలు చుడుతూ వారికి ఉన్నత చదువులు చెప్పించింది. తల్లి బాధలను దగ్గర్నుంచి చూసిన వారు ఆమె కష్టానికి తగిన ప్రతిఫలంగా ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన సోమయ్య-పద్మ దంపతులకు కుమారుడు మహేష్ కుమార్, కూతురు మౌనిక సంతానం.


మహేష్, మౌనిక చిన్నతనంలోనే సోమయ్య చనిపోయాడు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్నుంచి తల్లి పద్మ పిల్లలను పెంచి పెద్ద చేసింది. బీడీలు చుడుతూ వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే వారికి చదువులు చెప్పించింది. తల్లి కష్టాన్ని వమ్ము చేయకుండా కసిగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఎస్జీటీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మహేష్ కుమార్ 5వ ర్యాంకు, మౌనిక 15వ ర్యాంకు సాధించారు. పిల్లలిద్దరూ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బంధువులతో పాటు స్థానికులు వారిని అభినందిస్తున్నారు.


ఒకే ఏడాది 3 ప్రభుత్వ ఉద్యోగాలు


ఇక ఒకే ఏడాది ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు ఏజెన్సీకి చెందిన యువకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన మాదరపు అశోక్ ఎం.ఏ, బీఈడీ పూర్తి చేసాడు. మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పరీక్షలో ఆరో జోన్‌లో మొదటి ర్యాంకు సాధించి ఉద్యోగంలో చేరాడు. తాజాగా విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. స్కూల్ అసిస్టెంట్‌‌ టీచర్ పోస్టుల్లో మెరుగైన ర్యాంకు సాధించాడు. హాస్టల్ వార్డెన్ ఫలితాల్లోనూ సత్తాచాటి ఉద్యోగం సాధించాడు.


ఇదే జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వెగ్గళం విజయ్ సైతం డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. జిల్లా స్థాయిలో 46వ ర్యాంక్ సాధించాడు. పరీక్షకు మూడ్రోజుల ముందు తండ్రి ప్రభాకర శాస్త్రి చనిపోయినా.. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని.. తన పదేళ్ల నిరీక్షణ ఫలించిందని చెప్పాడు. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలమే ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa