ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండా సురేఖ మంత్రి పోస్ట్ ఊస్ట్..!?,,,వాస్తవం లేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:06 PM

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద.. ఇటు అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్ర దూమారం రేపాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. అసలే హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యలో.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయని భావించిన అధిష్ఠానం.. ఆ చేసిన ఆరోపణలపై వివరణ అడిగినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ వివరణ అడిగిందంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.


ఆదివారం (అక్టోబర్ 06న) రోజున గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖపై ఏఐసీసీ సీరియస్ అయిందని.. మంత్రి స్థానం నుంచి ఆమెను తొలిగించనున్నారంటూ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.


కొండా సురేఖ.. స్వయంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో అప్పుడే వివాదం ముగిసిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీలోనూ ఎలాంటి చర్చ లేదన్నారు. అయితే.. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా మాత్రం కావాలనే మంత్రి కొండా సురేఖ మీద బుదర జల్లే ప్రయత్నం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఆ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు.


మరోవైపు.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలంతా అలర్ట్‌గా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. క్షేత్రస్థాయిలో గెలిచినప్పుడే.. కార్యకర్తలకు గానీ, పార్టీ జెండాకు గానీ అసలైన గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులను దగ్గరుండి గెలిపించుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. రాబోయే రోజుల్లో దేశమంతా కాంగ్రెస్‌దే హవా ఉంటుందని వ్యాఖ్యానించారు. హర్యానాలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతుందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa