చాలా గ్యాప్ తరువాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన గులాబీ దళపతి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాట్లాడిన కేసీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు పూర్తయ్యిందని.. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు హైరానా కావాల్సిన అవసరం లేదన్నారు. పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.పాలన అంటే ఒట్టి మాటలతో నడిచేది కాదన్నారు కేసీఆర్. అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి.. వీన్ని లోపల వేయాలని బీఆర్ఎస్ చూడదన్నారు. 'ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. సమసమాజ నిర్మాణం చేయాలి. పది మందికి లాభం చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు' అని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. అది చేస్తాం.. ఇది చేస్తామని పిచ్చి మాటలు తమకు రావా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికా? లేక మాటలతో కాలయాపన చేయడానికా? అని కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు. తాము తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువే అమలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. అడగడని పథకాలు కూడా అమలు చేశామన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ ఉద్ఘాటించారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టిన భయపడాల్సిన పని లేదని పార్టీ శ్రేణులకు భరోసారి ఇచ్చారు గులాబీ దళపతి. అరెస్టులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. లీగల్‌గా పోరాడుదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారాయన. కాగా, శనివారం నాడు పలు పార్టీలకు చెందిన నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. ఇలా హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడక ముందే.. ఎలక్షన్ రిజల్ట్స్ ట్రెండ్స్ చూసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు కేసీఆర్. ఆ తరువాత ఇంట్లో పడిపోవడం, ఆస్పత్రిలో ఆపరేషన్, విశ్రాంతి కారణంగా కొన్ని నెలలు ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడంతో తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక రోజు సమావేశానికి హాజరైన కేసీఆర్.. ఆ తరువాత మళ్లీ జాడ లేకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రజా క్షేత్రంలోకి వచ్చింది లేదు. వచ్చినా మాట్లాడింది లేదు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ.. పార్టీ ముఖ్యనేతలు వచ్చినప్పుడు కలుస్తూ.. వారికి కీలక సూచనలు చేస్తున్నారు. దాదాపు 5 నెలల తరువాత కేసీఆర్ మళ్లీ తన నోరు విప్పి.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ విధానాలను తప్పుపడుతూ.. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ తన పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa