హైదరాబాద్‌లో చెరువులు, కుంటలే కాకుండా ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. హైడ్రాను ఏర్పాటు చేసి.. ఆక్రమణలపైన బుల్డోజర్లను ప్రయోగించింది. అయితే.. హైదరాబాద్ నగవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న చాలా నిర్మాణాలను హైడ్రా ఇప్పటికే కూల్చివేయగా.. కొన్ని ప్రాంతాల్లోని ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం నిరుపేదలపైనే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోందని.. ఖరీదైన ప్రాంతాల్లోని బడా బాబులు నిర్మాణాల జోలికి వెళ్లట్లేదంటూ ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఒక్కొక్క ప్రాంతంపై అధికారులు దృష్టి పెడుతున్నారని.. కాని కొన్ని ప్రాంతాల్లో సైలెంట్‌గా పని జరుగుతుందని.. కొద్ది రోజుల్లో అన్ని అవే బయటికొస్తాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే.. డిమాండ్ ఎక్కువగా ఉన్న ఐటీ కారిడార్, ఫ్యూటర్ సిటీ పరిధిలోని భూములపై సర్కార్ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది.
నగర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగా.. శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లోని ఐటీ కారిడార్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఫ్యూచర్‌సిటీల ప్రాంతాల్లో సర్కార్ భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ ఏడాది జనవరి నుంచే ఆయా భూముల్లోని ఆక్రమణలను అధికారులు సైలెంట్‌గా తొలగిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు డిజిటల్ సర్వేలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
అయితే.. కొన్ని సర్కార్ భూములను అన్యాక్రాంతం చేసుకునేందుకు అక్రమార్కులు రికార్డులను కూడా మార్చేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల్లో 60 శాతం నిజాం నవాబుల హయాంలో దానమిచ్చినవేనని తేలింది. వారసులు లేకపోవడంతో వాటిలో 90 శాతం ప్రభుత్వపరమయ్యాయి. ఇదే అదునుగా తీసుకున్న అక్రమార్కులు తప్పుడు రికార్డులు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరైతే.. ఏకంగా నిజాం వారసుల నుంచి దానం పొందామంటూ.. పత్రాలు సృష్టించి న్యాయస్థానాలకు కూడా ఆశ్రయిస్తున్నారు.
శేరిలింగంపల్లి మండలంలోని 3 గ్రామాల్లోని సుమారు 190 ఎకరాల సర్కార్ భూములపై ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. అలాగే.. గండిపేట మండలంలోని 4 గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల భూములపై వివాదాలు నడుస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం రికార్డులు మార్చి ధరణిలో పేర్లు వచ్చేలా చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు.. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని 4 గ్రామాల్లో కూడా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునేందుకు రియలెస్టేట్ సంస్థల ప్రతినిధులు రికార్డులు మార్చేసినట్టు అధికారుల దృష్టికి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa