రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్‌పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేశారు. దీంతో స్థలంతో పాటుగా డబ్బులు వెనక్కి వస్తాయంటూ నమ్మబలికారు. అలాగే ఈ స్కీమ్‌లోకి కొత్తగా ఎవరినైనా చేర్పిస్తే 25 నెలలపాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపించారు.
అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో మరో మోసానికి కూడా పాల్పడ్డారు. ఈ స్కీమ్‌లో కనీసం నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి సంవత్సరం తర్వాత రూ.8 లక్షలు విలువ జేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కట్ ఇస్తామంటూ 12 వెల్త్ క్యాపిటల్ సంస్థ ప్రచారం చేసింది. అలాగే గోల్డ్ చిట్ స్కీమ్ కింద 20 నెలల కాలానికి గానూ ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా 15000 చొప్పున 19 నెలలు చెల్లిస్తామని.. ఆఖరి నెలలో మరో 15 వేలు ఎక్స్‌ట్రా కూడా ఇస్తామంటూ ప్రజలకు ఆశచూపించారు. దీనిని నమ్మి సుమారుగా 3600 మంది ఈ సంస్థలో డిపాజిట్లు చేశారు. ఈ మొత్తం రూ.300 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. ఇంతా జరిగాకా ఆ సంస్థ బోర్డు తిప్పేయటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై సైబరాబాద్ పోలీసులను బాధితులు ఆశ్రయించగా.. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు8 మందిని అరెస్ట్ చేశారు. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరు పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే రోజూ ఇలాంటి ఘటనలు పేపర్లు, టీవీల్లో చూస్తున్నప్పటికీ జనంలో అవగాహన కలగడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనం ఆశలను క్యా్ష్ చేసుకునే ఇలాంటి వారిపై గట్టిచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.