నారాయణపేట్ జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంత మందికి ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించారు. 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.మరికొంత మందికి పాఠశాల వద్దే వైద్యుడి సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుపై పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.