తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని రాష్ట్ర డిజిపి జితేందర్ తెలియజేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించగా డిజిపి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ నూతన కార్యాలయ సేవలు ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చాయన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికత దన్నుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే అంశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.