ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 09:24 PM

గతంలో అంటే.. ఇంట్లో కట్టెల పొయ్యి మీదే వంటలన్ని వండేవారు. కాల క్రమేణ.. బొగ్గు పొయ్యిలని, ఎలక్ట్రిక్ స్టవ్‌లని, ఆ తర్వాత గ్యాస్ స్టవ్‌లు వచ్చాయి. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లు కూడా వచ్చేశాయి. కట్టెల పొయ్యి మీద అన్నం వండే రోజుల్లో ముందు ఎసరు పెట్టి.. మరిగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి.. ఉడికిన తర్వాత గంజి వంపేసి.. కాసేపు అలా వేడి తగలనిచ్చిన తర్వాత గానీ అన్నం మన ప్లేట్‌లోకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. పొయ్యి మీదో స్టవ్‌ మీదో కాదు.. డైరెక్టుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలోనే అన్నం వండేస్తున్నారు. 90 శాతం మంది ఇళ్లలో రైస్ కుక్కర్లలోనే అన్నం వండేస్తున్నారు. ఇక బ్యాచిలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.. రైస్ కుక్కర్లలో కేవలం అన్నమే కాదు.. అన్నీ వండేస్తున్నారు. రైస్ కుక్కర్ పాత్రలోనే బియ్యం పోశామా.. కడిగామా.. సరిపడా నీళ్లు వేశామా.. కుక్కర్‌లో పెట్టేసి స్విచ్చ్ వేశామా.. అన్నం దానికదే అయిపోతుంది. అది కూడా నిమిషాల్లోనే. ఈ రైస్ కుక్కర్లతో.. పొంగుతుందన్న బాధ గానీ.. అన్నమయ్యాక దింపేయకుంటే మాడిపోతుందన్న టెన్షన్‌లు గానీ ఏమీ ఉండవు.


ఇదంతా తెలిసిన కథే కదా.. కొత్తగా చెప్పడానికి, తెలుసుకోవటానికి ఏముంది అంటారా.. అక్కడికే వస్తున్నా. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వల్ల సింపుల్‌గా ఫాస్ట్‌గా అన్నం రెడీ అవుతూ లాభం చేకూరుస్తుందో.. కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగేలా చేస్తుంది. అచ్చంగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి ఓ వ్యక్తి ప్రాణాలే వదిలిన విషాదకర ఘటన.. జిల్లా కేంద్రంలోని గాంధీ కాలనీలో జరిగింది.


వికారాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గాంధీ కాలనీలో నివాసముండే సోమేశ్వర్ (85) అనే వృద్ధుడు.. అన్నం వండుకునేందుకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో బియ్యం, వాటికి సరిపడా నీళ్లు పోసీ కుక్కర్‌లో పెట్టి స్విచ్ఛ్ వేశాడు. ఏమైందో ఏమో కానీ.. అన్నమయ్యిందా లేదా అని చూసేందుకు సోమేశ్వర్ వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కుక్కర్ పేలిపోయింది.


ఈ ఘటనలో కుక్కర్ పేలి అందులో నుంచి మంటలు చెలరేగటంతో.. అక్కడే ఉన్న సోమేశ్వర్‌కు ఆ మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవటంతో.. ఆ అగ్నిజ్వాలల్లోనే సోమేశ్వర్ సజీవ దహనమయ్యారు. శరీరం పూర్తిగా కాలిపోవటంతో.. అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇరుగు పొరుగు వారు గమనించేసరికే.. జరగరాని నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అయితే.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపం ఉన్నా.. రైస్ పాత్రకు నీళ్లు ఉన్నా అవి కుక్కర్‌లో ఉన్న హీటర్ మీద పడి ఫ్లక్చ్‌వేశన్స్ జరిగే అవకాశం ఉటుంది. అలాంటి సందర్భాల్లోనూ.. కుక్కర్‌లో ఉన్న ఫ్యూజ్ పోయి కుక్కర్‌కు విద్యుత్ సరఫరాను ఆపేస్తుంది. అయితే.. ఫ్యూజ్ పనిచేయని సందర్భంలో పవర్ ఫ్లక్చ్‌వేషన్స్ జరగటం.. ఆటోమాటిక్ బటన్ పనిచేయని సమయంలో కుక్కర్ ఓవర్ హీట్ అవుతుండటం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కుక్కర్ పేలిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి.. రైస్ కుక్కర్ వాడుతున్న వాళ్లంతా.. ఈ రెండింటిని సరిగ్గా ఉండేలా చూసుకోవటంతో పాటు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవటం, ప్లగ్ పెట్టే దగ్గర లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవటం, పాత్ర పెట్టే సమయంలో తడి లేకుండా తూడవటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పైన చెప్పిన ఏ ఒక్క సమస్య ఉన్నా.. రైస్ కుక్కర్‌ను పక్కన పెట్టేయటమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com